మహేష్ బాబు ఇంట.. పెళ్లి సందడి! కొరియన్ అమ్మాయితో.. మేనల్లుడి ఎంగేజ్మెంట్
ABN, Publish Date - Jul 14 , 2026 | 05:08 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మహేష్ సోదరి పద్మావతి, బావ గల్లా జయదేవ్ ల చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా (Siddharth Galla) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సౌత్ కొరియా (South Korea) దేశానికి చెందిన హాయిన్ కిమ్ (Hyein Kim) అనే యువతితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్.. ఆదివారం నాడు రెండు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నాడు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మహేష్ సతీమణి నమ్రత (Namrata Shirodkar) తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ కాబోయే వధూవరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలలో నమ్రతతో పాటు మహేష్ అక్కలు, ఆయన అన్న రమేష్ బాబు కుమార్తె భారతి సందడి చేస్తూ కనిపించారు. ముఖ్యంగా ఈ ఫోటోల్లో భారతి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం. బంధుమిత్రుల కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుక ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
గల్లా జయదేవ్ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్దవాడైన అశోక్ ఇప్పటికే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అశోక్ హీరోగా నటిస్తున్న వీసా మూవీత్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక చిన్న కుమారుడు సిద్ధార్థ్ సినిమాల వైపు కాకుండా కుటుంబానికి చెందిన బిజినెస్ వ్యవహారాల చూసుకుంటున్నాడు. ఇలా వ్యాపార రంగంలో బిజీగా ఉన్న సిద్ధార్థ్.. కొరియన్ బ్యూటీ హాయిన్ తో ప్రేమలో పడటం, పెద్దల అంగీకారంతో ఇప్పుడు ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టడం విశేషం.
వీరిద్దరి ప్రేమకథకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో నిశ్చితార్థ ఘట్టం అంగరంగ వైభవంగా పూర్తయింది. ఒకవైపు కుటుంబంలో ఇలాంటి సంతోషకరమైన వాతావరణం నెలకొనగా.. మరోవైపు, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.