విశ్వంభర: ట్రైలర్ అప్‌డేట్ అందుకే ఆగింది..
ABN, Publish Date - Mar 27 , 2026 | 06:10 PM
చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఇప్పటికే ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడింది.
చిరంజీవి (chiranjeevi) హీరోగా వశిష్ఠ మల్లిడి (Vassista) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఇప్పటికే ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జూన్ లేదా జులైలో విడుదలయ్యే అవకాశం ఉంది. వీఎఫ్‌ఎక్స్ పనులు ఆలస్యం కావడం, విడుదల వాయిదా పడటం, టీజర్ ఓ మాదిరిగా ఉండటం, అది ట్రోల్‌కి గురి కావడంతో సినిమాకు ఉన్న బజ్ మొత్తం తగ్గిపోయింది. అభిమానులు సైతం ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. త్వరలో రాబోతున్న ట్రైలర్ ఆసక్తికరంగా ఉంటే తప్ప ఈ సినిమా గురించి ఎవరూ మాట్లాడుకోరని నెటిజన్లు అనుకుంటున్నారు. ఈ విషయం గ్రహించిన మేకర్స్ ట్రైలర్ కట్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోనున్నారట. అయితే వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగానే జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే పూర్తయిన వీఎఫ్‌ఎక్స్ షాట్స్ నిర్మాతల చెంతకు చేరుతున్నాయి. సినిమాకు కీలకమైన ఎపిసోడ్స్ మాత్రం అంచనాలకు మించి వచ్చినట్లు దర్శకుడి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ట్రైలర్ బయటకు వచ్చాక సినిమా గురించి బాగా మాట్లాడుకుంటారని, సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుందని ఇన్‌సైడ్ టాక్. అయితే శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్ ఇద్దామనుకున్నారట. రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ గ్లింప్స్ వల్ల ఆ ఆలోచన విరమించుకున్నారని తెలిసింది. త్వరలో వచ్చే ట్రైలర్ తోపాటు సినిమా విడుదలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓటీటీ డీల్‌పై చర్చలు నడుస్తున్నాయి. దానిపై కూడా త్వరలో స్పష్టత రావచ్చు. చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.