‘విశ్వంభర’పై క్లారిటీ వచ్చేది ఆ రోజేనా?
ABN, Publish Date - Jul 04 , 2026 | 05:34 PM
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీ విడుదలకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా, యంగ్ డైరెక్టర్ వశిష్ట (Mallidi Vassishta) తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్‌ను సుదీర్ఘ విరామం తర్వాత ఒక విలక్షణమైన సోషియో-ఫాంటసీ జోనర్‌లో చూడబోతుండటంతో, అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అయితే, గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ వరుస పోస్ట్‌పోన్‌మెంట్ల వల్ల సినిమాపై ఉన్న ఆసక్తి, హైప్ కొద్దిగా తగ్గినట్లు అనిపించినప్పటికీ, తాజా లీకులు మెగా ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ నింపుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం యొక్క గ్రాఫిక్స్ పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయట. విశేషం ఏమిటంటే, ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులను ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా పర్యవేక్షించారని, అవుట్‌పుట్ చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఇక ‘విశ్వంభర’ విడుదల తేదీపై ఒక క్లారిటీ వచ్చినట్లు టాక్. ఈ విజువల్ వండర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేసినట్లు అనధికారికంగా గట్టి ప్రచారం నడుస్తోంది. పండుగ సెలవుల సీజన్ కావడంతో ఈ తేదీ పర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట. అయితే, ఈ అక్టోబర్ 16 రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మేకర్స్ టీజర్ లేదా గ్లింప్స్ ద్వారా ఈ జూలైలోనే సర్‌ప్రైజ్ ఇస్తారా, లేక మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న గ్రాండ్‌గా ప్రకటిస్తారా.. అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిరు పుట్టినరోజు సందర్భంగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మెగా 158’ సినిమా నుంచి కూడా ఒక భారీ అప్‌డేట్ రానుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
మరోవైపు అక్టోబర్‌లో ‘విశ్వంభర’తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు థియేటర్లలోకి రానున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా, దసరా పండుగకు ముందు వచ్చే లాంగ్ వీకెండ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ పవర్ ఫుల్ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. గతంలో వచ్చిన ‘జైలర్’ సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమా వచ్చిన మరుసటి రోజే చిరంజీవి ‘విశ్వంభర’ కూడా రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరగనుంది.
ఇవి కూడా చదవండి:
ఇదే ఈ బాబాయ్- అబ్బాయ్ డెబ్యూ స్పెషాలిటీ!
అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్? ఇక ఊహించుకోండి!
Varanasi: క్రేజీ ఫొటో.. రాముడిగా మహేష్ బాబు లుక్ ఇదేనా