Vishwambhara: కుదరని బేరం.. కదలని సినిమా
ABN, Publish Date - Sep 10 , 2026 | 01:52 PM
మెగాభిమానులు ఎంతో కాలంగా ఆశగా, ఆత్రుతగా ఎదురు చూస్తున్న ‘విశ్వంభర’ చిత్రం పరిస్థితి ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి అన్న చందాన తయారయింది.
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు మెగాభిమానులు ఎంతో కాలంగా ఆశగా, ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘విశ్వంభర’(Vishwambhara) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా... విడుదల ఎప్పుడు అనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. నిజానికి ‘మన శంకరవరప్రసాద్’ కంటే ముందే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ రాలేదు.
పోనీ ఈ ఏడాది సంక్రాంతి మిస్ అయింది కదా.. వచ్చే సంక్రాంతికైనా విడుదల ఉంటుందా అని ఆశిస్తే, దర్శకుడు బాబీ తన 'కాకా' సినిమాతో ఇప్పటికే సంక్రాంతి రేసులో కర్చీఫ్ వేసేశారు. మరి 'విశ్వంభర' పరిస్థితి ఏమిటి? ఈ ఏడాది సమ్మర్‌కే ఈ సినిమా వస్తుందని అంతా ఆశించారు. అయితే రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా కోసం 'విశ్వంభర'ను వెనక్కి తగ్గించారని వార్తలు వచ్చాయి. ఇలా వరుసగా వాయిదాలు పడుతుండడంతో మెగాభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఈ సినిమాలో సెకండాఫ్ మొత్తం గ్రాఫిక్స్ వర్క్ మీదే ఆధారపడి ఉందట. అందుకే మేకర్స్ దాదాపు రెండేళ్ల సమయం కేవలం VFX కోసమే తీసుకున్నారు. అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులకు అందించాలంటే కొంత ఆలస్యం అవడం సహజమే. కానీ గ్రాఫిక్స్ కోసం మరీ ఇంత లేట్ అవ్వడం ఏంటని సామాన్య ప్రేక్షకులకు సైతం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చందమామ కథలా సాగిపోతూ పిల్లల్నీ, పెద్దవాళ్లనీ విశ్వంభర ఎంతగానో అలరిస్తుందని ఏడాది క్రితం చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేస్తూ చెప్పారు.
అంతేకాదు, 2026 సమ్మర్‌కు ఈ సినిమా తప్పకుండా విడుదల అవుతుందని అభిమానులకు భరోసా కూడా ఇచ్చారు. ఆ సమ్మర్ వచ్చింది... వెళ్లిపోయింది. కానీ 'విశ్వంభర' మాత్రం థియేటర్లకు రానే లేదు. తమ హీరో ఇచ్చిన మాటను కూడా అబద్ధం చేసినందుకు మేకర్స్ మీద మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగానైనా విశ్వంభర రిలీజ్ డేట్ అప్‌డేట్ వస్తుందని అంతా భావించారు కానీ, అక్కడ కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు.
మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'కాకా' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆయన దృష్టంతా ఇప్పుడు ఆ సినిమా పైనే ఉంది. రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించడంతో దర్శకుడు బాబీ పక్కా ప్లానింగ్‌తో వర్క్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో 'విశ్వంభర' దర్శకుడు వశిష్ట ఈ సినిమాను పక్కన పెట్టేసి, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
దీంతో 'విశ్వంభర' భవిష్యత్తు ఏంటనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఇక సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఈ ప్రాజెక్ట్‌ను వదిలిపెట్టి 'వారణాసి' సినిమాకు వెళ్ళిపోవడంతో, మరో సంగీత దర్శకుడు హరి గౌర సారథ్యంలో రీ-రికార్డింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఒక భారీ సినిమా విడుదల కాకముందే ఆ చిత్ర హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు ఇలా వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ కావడం చిత్ర పరిశ్రమలో నిజంగానే ఒక అరుదైన విషయం.
‘విశ్వంభర’కి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, విజువల్స్ అద్భుతంగా వచ్చాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సినిమా విడుదలకు ప్రధాన అడ్డంకిగా మారింది ఓటీటీ డీల్.నిర్మాతలు ఆశిస్తున్న రేటుకు, ఓటీటీ సంస్థలు ఇస్తామంటున్న రేటుకు మధ్య చాలా వ్యత్యాసం ఉండడం వల్లే ఈ డీల్ ఇంకా క్లోజ్ కాలేదట. ఓటీటీ బిజినెస్ పూర్తయితే తప్ప రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఏదేమైనా, నిర్మాతలు కోరుకున్నట్లుగా త్వరలోనే ఓటీటీ డీల్ పూర్తయి, ‘విశ్వంభర’ గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.