విజయ్, రష్మికలపై దుష్ప్రచారం.. రంగంలోకి దిగిన లీగల్ టీమ్
ABN, Publish Date - Oct 26 , 2026 | 08:38 PM
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ జోడి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (ViRosh) జంటకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వారి అధికారిక ప్రతినిధి బృందం తీవ్రంగా స్పందించింది.
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ జోడి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (ViRosh) జంటకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వారి అధికారిక ప్రతినిధి బృందం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు విరోష్ టీమ్ ఒక అధికారిక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. విజయ్, రష్మికలపై కావాలనే తప్పుడు కథనాలు, మార్ఫింగ్ చేసిన స్క్రీన్షాట్లు, ఫేక్ నరేటివ్‌లను సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఈ ప్రెస్ నోట్లో స్పష్టం చేశారు.
వాక్ స్వాతంత్ర్యాన్ని, సద్విమర్శలను తాము ఎప్పుడూ గౌరవిస్తామని, అయితే ఫ్యాబ్రికేటెడ్ కంటెంట్‌ను, తప్పుదారి పట్టించే తప్పుడు ప్రచారాలను మాత్రం సహించేది లేదని టీమ్ తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో కొందరు కావాలనే పన్నాగంతో టార్గెటెడ్ ఆన్లైన్ హరాస్మెంట్కు పాల్పడుతున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు, లింక్స్‌ను సైబర్ క్రైమ్ అధికారులకు అందజేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విరోష్ జంట గౌరవాన్ని, ప్రతిష్ఠను కాపాడేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు. ఇక ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే.. బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ప్రేమ గురించి, పెళ్లి గురించి కొన్ని విషయాలను బయటపెట్టారు. రష్మిక పెళ్లి చేసుకోమని వందసార్లు అడిగిందని విజయ్ చెప్పగా.. ఏడాది మొత్తం తనకు ప్రపోజ్ చేశానని రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో విజయ్ రెడ్ ఫ్లాగ్ అంటూ ట్రోలింగ్ నడిచింది. ఆ తరువాత వీరిద్దరూ సోషల్ మీడియాలో ఫాలో కాకపోవడంతో విడాకులు తీసుకుంటున్నారు అంటూ కూడా చాలామంది చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్రోలింగ్ పై విరోష్ హుందాగా స్పందించారు. తాము తమ లైఫ్ లో బాగానే ఉన్నామని చెప్పుకొచ్చారు. ముందు ముందు ఇలాంటివి జరగకుండా సైబర్ క్రైమ్ ని ఆశ్రయించి ఈ ట్రోలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు.