న్యూ ఇయర్‌కు ‘వింటారా సరదాగా’..

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:32 PM

అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన ‘వింటారా సరదాగా’ సినిమా 2027 జనవరి 1న విడుదల కానుంది. శ్రీగౌరీ ప్రియ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే టీజర్లు, పాటలతో ఆసక్తి పెరిగింది.

Vintara Saradaga Movie

తెలుగమ్మాయి శ్రీగౌరీ ప్రియ నటించిన రెండు సినిమాలు ఈ యేడాది జనం ముందుకొచ్చాయి. అందులో ఒకటి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ నటించిన తమిళ చిత్రం 'హ్యాపీరాజ్‌' కాగా రెండోది కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ'. మొదటి సినిమా పెద్దంతగా ఆడలేదు కానీ 'చెన్నై లవ్ స్టోరీ' మంచి విజయాన్నే అందుకుంది. అలానే తెలుగులో శ్రీగౌరి ప్రియ నటించిన 'వింటారా సరదాగా' సినిమా విడుదల కావాల్సి ఉంది. విశేషం ఏమంటే నవంబర్ 13న శ్రీగౌరి ప్రియ పుట్టిన రోజు. ఆ రోజున చిత్ర బృందం ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఆ మర్నాడే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. అశోక్ గల్లా హీరోగా నటించిన ఈ సినిమాను ఉద్భవ్‌ రఘు డైరెక్ట్ చేస్తున్నారు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ సినిమాను 2027 జనవరి 1న విడుదల చేయబోతున్నారు. ప్రేమ, స్నేహం, సరదా, యువత జీవితంలోని అనుభవాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ చిత్రం న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. ఉన్నతమైన కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో స్వదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాల చుట్టూ కథనం సాగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవనశైలి, స్నేహాలు, ప్రేమలు, అనుకోని సంఘటనలు, ఎదురయ్యే ఆసక్తికరమైన పరిస్థితులను వినోదాత్మకంగా ఈ సినిమాలో ఆవిష్కరించారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వివా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


'వింటారా సరదాగా' నుంచి ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. యూత్‌ఫుల్ కథాంశం, వినోదభరితమైన సన్నివేశాలు, అశోక్ గల్లా – శ్రీ గౌరీ ప్రియ జంట మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ‘అనగా అనగా అమెరికా’, ‘చింగారి’ పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంజిత్ హెగ్డే ఆలపించిన ‘అనగా అనగా అమెరికా’ పాట అమెరికాలో హీరోహీరోయిన్ల ప్రయాణంలోని ప్రేమ, కొత్తదనం, ఆహ్లాదకరమైన భావాలను ఆవిష్కరిస్తే, సిద్ శ్రీరామ్, లిప్సిక ఆలపించిన ‘చింగారి’ పాట ప్రేమలోని మధురమైన అనుభూతులను పలికించింది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం ఏమంటే... గత యేడాది ఇదే సంస్థ నిర్మించిన 'ఆల్కాహాల్' మూవీని 2026 జనవరి 1న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఆ సినిమా అనుకున్న తేదీకి విడుదల కాలేదు. సరికదా దాదాపు 11 నెలల తర్వాత ఈ డిసెంబర్‌ 18న విడుదల కాబోతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన 'వింటారా సరదాగా' విషయంలో అలా జరక్కపోతే చాలని సినీజనం భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Gondhal Review: ఆస్కార్ అఫీషియ‌ల్ ఎంట్రీ.. 'గోంధ‌ల్' మూవీ తెలుగు రివ్యూ

Maya Lady Movie Review: మాయ లేడి ఎలా ఉందంటే...

DNK Review: మౌళి తనూజ్‌.. డీఎన్‌కే సినిమా రివ్యూ!

Itlu Arjuna Review: 'ఇట్లు అర్జున' ఎలా ఉందంటే

Goat Movie Review: సుడిగాలి సుధీర్‌ గోట్‌ మూవీ రివ్యూ

Updated Date - Nov 14 , 2026 | 12:43 PM