Gondhal Review: ఆస్కార్ ఆఫీసియ‌ల్ ఎంట్రీ.. 'గోంధ‌ల్' మూవీ తెలుగు రివ్యూ

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:08 AM

ఈ ఏడాది మ‌న దేశం నుంచి ప్ర‌తిష్ఠాత్మక 99వ అకాడ‌మీ అవార్డ్స్‌కు అఫీసియ‌ల్ ఎంట్రీగా అర్హ‌త సాధించిన చిత్రం గోంధ‌ల్ రివ్యూ.

Gondhal Movie Review Telugu

మ‌న దేశం నుంచి, 2027లో జరిగే ప్ర‌తిష్ఠాత్మ‌క‌ 99వ అకాడ‌మీ అవార్డులకు అధికారిక ఎంట్రీగా ఎంపికైన మరాఠీ చిత్రం 'గోంధల్'. ఎన్నో భారీ బడ్జెట్‌ చిత్రాల‌ను పక్కన పెట్టి, ఓ మాములు మ‌రాఠీ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జ్యూరీ ఎంపిక చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. గ‌తేడాది న‌వంబ‌ర్‌లోనే ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన ఈ చిత్రం అంత‌గా జ‌నాద‌ర‌ణ పొంద‌లేక పోయింది. కానీ జాతీయంగా, అంత‌ర్జాతీయంగా అనేక పుర‌స్కారాల‌ను సొంతం చేసుకుని స‌త్తా చాటింది. ఈ చిత్రం ఆస్కార్‌కు ఎంపికైన నేప‌థ్యంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ హోంబలే ఫిలింస్ ఇప్పుడు ఈ చిత్రాన్ని ద‌క్షిణాది భాష‌ల్లోకి అనువ‌దించి విడుద‌ల చేసింది. మ‌రాఠీలోను శ‌నివారం రీ-రిలీజ్ చేశారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది, ఆస్కార్‌కు నామినేట్ అయ్యేంత‌గా ఈ చిత్రంలో ఏముందో తెలుసుకుందాం.

తొంభై ద‌శ‌కంలో మ‌హారాష్ట్ర‌లోని ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. ఎనిమిది వందల యేళ్ళ నాటి మహారాష్ట్ర జానపద ఆచారం గోంధల్‌ నేపథ్యంలో ఇది సాగుతుంది. కాస్త స్వ‌తంత్య్ర భావాలు ఉన్న సుమ‌న్ అనే యువ‌తి త‌న‌కు ఇష్టం లేకపోయినా, త‌ల్లిదండ్రుల బ‌ల‌వంతంతో ఆనంద‌రావు అనే అమాయ‌క ధ‌న‌వంతుడిని పెళ్లి చేసుకుంటుంది. అత‌ను సంసార జీవితానికి పనికి రాడని ఆవేద‌న చెందుతుంది. అయితే పెళ్లి జ‌రిగిన తొలి రోజు రాత్రి అక్క‌డి గ్రామ ఆచారం ప్ర‌కారం ప్ర‌త్యేక క‌ళాకారులు విచ్చేసి గోంధల్‌ అనే భక్తి సంప్రదాయ వేడుకను నిర్వ‌హిస్తారు. పెళ్లి కొడుకు పెద‌నాన్న అబా సాహెబ్ పాటిల్‌ ఆ గ్రామానికి పాటిల్ అనే హోదాతో అక్క‌డి ప్ర‌జ‌ల‌పై పెత్త‌నం చెలాయిస్తూ ఉంటాడు. ఎలాగైనా త‌న కుమారుడు స‌ర్జే రావును తన ప‌ద‌విలో కూర్చోపెట్టి, ఊరును చెప్పుచేతల్లో పెట్టుకోవాలని ఆశిస్తుంటాడు. అయితే కొత్త పెళ్ళికూతురు సుమన్‌పై సర్జేరావు మనసు పారేసుకుంటాడు. సుమన్‌ సైతం పాటిల్‌ హోదాపై మక్కువతో అతనితో చనువుగా మెలుగుతుంటుంది. కొత్త పెళ్ళికొడుకు ఆనందరావు అడ్డును తొలగించాలని వీళ్ళు పథక రచన చేస్తారు. మరి సుమన్‌, సర్జేరావు వేసిన పథకం పారిందా? ఆనంద రావు అడ్డును వీరు తొలగించగలిగారా? కొడుకును పాటిల్‌ హోదాలో చూడాలనుకున్న అబా సాహేబ్‌ కు ఎలాంటి గతి పట్టింది? అనేదే ఈ సినిమా కథ.

కన్నడ జానపద కళ భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన 'కాంతార' చిత్రానికికు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చక్కని గుర్తింపు రావడంతో చాలామంది తమ తమ రాష్ట్రాలలోని జానపద గాథలను, కళలను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో సినిమాలు తీసి ప్రేక్షకాదరణ పొందాలని భావిస్తున్నారు. ఇది కూడా అదే కోవకు చెందిన సినిమా. మరాఠాల జానపద కళ 'గోంధల్‌' ఆధారంగా ఈ సినిమా అదే పేరుతో రూపుదిద్దుకుంది. ఓ తాత‌, మ‌నుమ‌డితో సినిమాను ప్రారంభించిన నిమిషాల్లోనే దర్శకుడు క‌థ‌లోకి తీసుకెళ్ళిపోయాడు. ఓ ప‌క్క‌ గోంధ‌ల్ కార్య‌క్ర‌మం న‌డుస్తుండ‌గానే మ‌రోవైపు ఆ ఇంట్లో ఒక్క రాత్రిలో పెళ్లి కూతురు చుట్టూ జ‌రిగే విభిన్న త‌ర‌హా ప‌రిణామాల నేప‌థ్యంలో సినిమా ఆస‌క్తిగా సాగుతుంది. అయితే ప్ర‌థమార్ధంలో వ‌చ్చే కొన్ని డైలాగ్స్ కాస్త వెగ‌టుగా, మొర‌టుగా అనిపిస్తాయి. అంతేకాదు గోంధ‌ల్ ప్ర‌ద‌ర్శనలో భాగంగా వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలు మహిళల పట్ల కాస్తంత చిన్న చూపు కలిగించేలా ఉన్నాయి. అయితే సినిమాలోని సంభాషణలు క‌థ‌నానికి బ‌లం చేకూర్చాయి. అంతేకాదు సాంకేతికంగానూ లిప్ సింక్ ఫ‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయి ఓ డ‌బ్బింగ్ సినిమా చూస్తున్నామ‌నే భావ‌న కలిగించలేదు. ఈ ఫీల్‌ మొదటి నుంచి చివరి వరకూ ఉంది.

Gondhal

ఈ సినిమాకు సంబంధించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా అందించిన‌ సంగీతం గురించి. 'గోంధల్' మూవీ కథాకథనాలకన్నా ఇళయరాజా నేప‌థ్య‌ సంగీత‌మే ఎక్కవ మార్కులు కొట్టేసింది. అంతలా ఇళయరాజా తన సంగీతంలో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశారు. ఇక కొత్తపెళ్లికొడుకు ఆనందరావు ఓ కోడిని బుట్ట కింద నుంచి బయటకు పంపడం... చివరిలో దానిని బుట్టకింద దాచే సన్నివేశంతో సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్రేక్షకులకు బోధపడుతుంది. ఈ సన్నివేశంతో అందరికీ ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ అర్థమౌతుంది. అలానే సినిమా ఆరంభంలో వ‌చ్చే ఇరవై ఐదు నిమిషాల నిడివితో ఉన్న‌ సింగిల్ టేక్‌ స‌న్నివేశం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాకు రచన చేసి సంతోష్ దవాఖర్ స్వీయ దర్శకత్వంలో దీనిని నిర్మించారు. కిషోర్ కదమ్ (Kishor Kadam), ఇషితా దేశ్‌ముఖ్ (Ishita Deshmukh), యోగేష్ సోహోని (Yogesh Sohoni), నిషాద్ భోయిర్ (Nishad Bhoir), అనుజ్ ప్రభు (Anuj Prabhu) ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించారు. ఆ యా పాత్ర‌ల్లో వారు చక్కగా ఒదిగిపోయారు. ప్ర‌ధానంగా సుమ‌న్ పాత్రలో ఇషితా దేశ్ ముఖ్‌ బహుముఖీన అభినయంతో ఆకట్టుకుంది. ఆనంద రావు పాత్ర‌లో యోగేష్ సోహోని ఇటు అమాయ‌కుడిగా, అటు మొహ‌మాట‌స్తుడిగా కనిపిస్తూనే చివరిలో తన హావభావాలతో అదరగొట్టాడు. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ప్రథమార్ధం పాత్రల పరిచయంతో సాగిపోగా, ద్వితీయార్థంలో అసలు కథలోకి వెళ్ళి తర్వాత ఏం జరుగబోతోందనే ఉత్కంఠను కలగచేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌ చిత్రాలను ఇష్టపడే వారికి 'గోంధల్‌' నచ్చుతుంది.

రేటింగ్ 2.75/5

ట్యాగ్‌లైన్‌: ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌

Updated Date - Nov 14 , 2026 | 08:19 AM