'జన నాయగన్'కు ఘడియకో గండం
ABN, Publish Date - Apr 10 , 2026 | 03:00 PM
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగన్' మూవీకి మరో కష్టం వచ్చి పడింది. విజయ్ పాలిటిక్స్ కారణంగా ఎలక్షన్ కోడ్ రీత్యా 'జన నాయగన్ కు రిలీజ్ కు అడ్డంకి ఎదురయింది.
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగన్' మూవీకి మరో కష్టం వచ్చి పడింది. విజయ్ పాలిటిక్స్ కారణంగా ఎలక్షన్ కోడ్ రీత్యా 'జన నాయగన్ కు రిలీజ్ కు అడ్డంకి ఎదురయింది. ఆ సినిమా ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో సమస్య వచ్చి పడింది. ఇప్పుడెలా...!
ఎలక్షన్స్... ఇంటర్నెట్ లో...
విజయ్ కథానాయకునిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జన నాయగన్' మూవీ జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాలసింది... ఈ మూవీ తెలుగులో 'జననాయకుడు'గా రావాల్సింది... అయితే సెన్సార్ సమస్యల వల్ల, నిర్మాత కోర్టు మెట్లెక్కడం, తరువాత సెన్సార్ వారు కేసు వేయడం ఇలా 'జన నాయగన్' రిలీజ్ కు అవాంతరాలు కలిగాయి... ప్రస్తుతం తమిళనాట ఎన్నికలు జరుగుతున్నాయి... హీరో విజయ్ తన 'తమిళగ వెట్రి కళగమ్' పార్టీపై అన్ని స్థానాలకూ పోటీ చేస్తున్నారు. ఆయన ఈస్ట్ ట్రిచీ, పెరంబూర్ నుండి బరిలోకి దిగారు... ఈ నేపథ్యంలో 'జన నాయగన్'కు ఎన్నికల్ కోడ్ అడ్డు నిలచి సినిమా విడుదలకు ఆటంకంగా మారింది... అయితే ఇప్పుడు 'జన నాయగన్' క్వాలిటీ ప్రింట్ తో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది... కావాలనే 'జన నాయగన్'ను సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యేలా చేశారా? అంటే అవుననే అంటున్నారు. ఈ సినిమాను నెట్లో చూసిన వారికి విజయ్ పై మరింత అభిమానం పెరిగి ఆయన 'టీవీకే' పార్టీకి ఓట్లు అధికంగా పడతాయని భావిస్తున్నారు. కాదు, ప్రత్యర్థులే ఓ పథకం ప్రకారం 'జన నాయగన్' ను లీక్ చేశారనీ చెబుతున్నారు... ఈ మూవీ లీక్ వల్ల విజయ్ కి నష్టమే వాటిల్లుతుందని కొందరి అభిప్రాయం. అలా 'జన నాయగన్' లీక్ పై చర్చోపచర్చలు సాగుతున్నాయి.
అప్పటి దాకా ఆగాల్సిందేనా...!
తమిళనాట విజయ్ ను 'పవర్ స్టార్' అని పిలుస్తారు... ఇప్పుడు ఈ పవర్ స్టార్ కు వచ్చిన సమస్యనే గతంలో టాలీవుడ్ 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ కూ వచ్చిందని సినీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు... అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ విభజనకు తీవ్ర పోరాటం సాగుతూ ఉంది. 2013లో పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కారణంగా అప్పటి వరకు పలు చిత్రాల విడుదలలో జాప్యం జరిగింది... 'అత్తారింటికి దారేది' ఇంటర్నెట్ లో లీక్ కాగానే, వెంటనే థియేట్రికల్ రిలీజ్ చేశారు. 2013 సెప్టెంబర్ 27న విడుదలైన 'అత్తారింటికి దారేది' అనూహ్య విజయం సాధించింది... అదే తీరున విజయ్ 'జన నాయగన్'ను కూడా నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లకుండా కోర్టు విడుదలకు అనుమతినిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు... 'జన నాయగన్' చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణ ఇప్పటికే ఎంతో నష్టపోయారని, ఇక సోషల్ మీడియాలో గుడ్ క్వాలిటీతో మూవీ లభ్యమయితే థియేటర్స్ కు వచ్చి చూసేవారు ఉండరని పరిశీలకులు అంటున్నారు... కావున మానవతా దృక్పథంతో అయినా, పైరసీ కారులను అడ్డుకొని 'జననాయగన్' నిర్మాతకు నష్టం వాటిల్లకుండా చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు... ఈ నెల 23వ తేదీన తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి... ఆ తరువాత 'జన నాయగన్' ఏ తీరున జనం ముందు నిలుస్తుందో చూడాలి...
మొదటి నుంచీ అంతే...
తమిళనాట రాజకీయాలు, సినిమాలు జోడుగుర్రాల్లా సాగుతూ ఉంటాయి... అన్నా దొరై తమిళనాడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ సినిమా జనం, లేదా ఆ పార్టీలకు చెందినవారే అక్కడ రాజ్యమేలుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ సైతం సినిమా రంగం నుండి వచ్చి ముఖ్యమంత్రి అయిన కరుణానిధి తనయుడే కావడం విశేషం! అలా ఇప్పటికి పలువురు సినీ జీవులు తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు... ఇప్పుడు విజయ్ తన సొంత పార్టీ 'టీవీకే' తరపున రంగంలోకి దిగారు... ఆయన తాజా చిత్రం 'జననాయగన్' సంక్రాంతి రేసులో రిలీజ్ కావాలి. అప్పటి నుంచీ ఆ సినిమా చుట్టూ ఏదో ఒక సమస్య తిరుగుతూనే ఉంది... మొత్తానికి 'జన నాయగన్' అన్నిటినీ దాటుకొని రిలీజ్ కు సిద్ధమయ్యే సమయానికి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ కోడ్ రాకముందే సినిమా రిలీజ్ అయి ఉంటే ఏ ప్రాబ్లెమ్ ఉండేది కాదు... ఇప్పుడు 'జన నాయగన్' ఇంటర్నెట్ లో గుడ్ క్వాలిటీతో ప్రత్యక్షమయింది. దాంతో విజయ్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు... కావాలనే ఓ వర్గం వారు తమ హీరో సినిమాను మొదటి నుంచీ రిలీజ్ కాకుండా అడ్డుకుంటున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.