Puri Sethupathi: రూత్‌లెస్.. స్లమ్‌డాగ్! విజయ్ సేతుపతి.. లుక్ అదిరింది
ABN , Publish Date - Jan 16 , 2026 | 12:42 PM
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్స్‌లో పూరీ జగన్నాథ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన హీరోల క్యారెక్టరైజేషన్ ఎప్పుడూ ఒక పదునైన కత్తిలా ఉంటుంది. తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఆయన ప్రకటించిన స్లమ్‌డాగ్ ఫస్ట్ లుక్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద మరోసారి పూరీ మార్క్ సెన్సేషన్ గ్యారెంటీ అనిపిస్తోంది.
ఈ పోస్టర్‌లో అందరినీ ముందుగా ఆకట్టుకునేది విజయ్ సేతుపతి వేషధారణ. చిందరవందరగా ఉన్న జుట్టు, గడ్డం, కళ్ళకు నల్లటి కళ్ళద్దాలు.. వీటన్నిటికీ తోడు ఒంటిపై ఉన్న మాసిన బట్టలు ఆయన పాత్రలోని తీవ్రతను తెలియజేస్తున్నాయి. సాధారణంగా పూరీ హీరోలు ఆటిట్యూడ్‌తో కొడితే, ఇక్కడ విజయ్ సేతుపతి తన లుక్‌తోనే భయపెడుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి బ్లైండ్ బెగ్గర్‌గా కనబడబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. విజయ్ సేతుపతి చేతిలో రక్తం చిందిన పెద్ద కత్తి తో ఆ క్యారెక్టర్ ఎంత వయలెంట్‌గా ఉండబోతుందో హింట్ ఇస్తోంది. పోస్టర్ అంతటా గాలిలో ఎగురుతున్న కరెన్సీ నోట్లు మనకు కనిపిస్తాయి. కింద నేల పైన, చెక్క పెట్టెల మీద కూడా డబ్బు కుప్పలుగా పడి ఉంది. ఇది ఒక గోడౌన్ లాంటి ప్రదేశంలా కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే, ఈ కథ అంతా భారీ కుంభకోణం చుట్టూ గానీ లేదా అక్రమ సంపాదన చుట్టూ గానీ తిరుగుతుందని అర్థమవుతోంది. 
పోస్టర్‌తోనే ఇది ఒక పక్కా యాక్షన్ డ్రామా అని స్పష్టం చేస్తోంది. పూరీ సినిమాల్లో టైటిల్స్ ఎప్పుడూ క్యాచీగా ఉంటాయి, ఈ స్లమ్‌డాగ్ టైటిల్ కూడా అదే కోవలోకి వస్తుంది. పూరీ కనెక్ట్స్ పతాకంపై చార్మీ కౌర్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. యానిమల్ సినిమాతో తన మ్యూజిక్ పవర్ చూపించిన ఆయన, ఈ సినిమాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి స్లమ్‌డాగ్ ఫస్ట్ లుక్ చూశాక, విజయ్ సేతుపతిని పూరీ జగన్నాథ్ ఒక పవర్ ఫుల్ మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. డబ్బు కోసం ఏదైనా చేసే రఫ్ క్యారెక్టరా..? లేక అన్యాయాన్ని ఎదిరించే మొనగాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.