Kingdom: ప్లాప్ అయిన సినిమాను ట్రెండ్ చేస్తున్నారెందుకురా
ABN, Publish Date - Jul 31 , 2026 | 10:18 PM
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బిగ్ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్‌డమ్ (Kingdom).
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బిగ్ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్‌డమ్ (Kingdom). ఎన్నో అంచనాలతో గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత విజయ్ నుంచి వచ్చిన ఏ సినిమా హిట్ ని అందించలేదు. దీంతో ఈ సినిమా అయినా విజయ్ ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో అనుకున్నా కూడా ఇది కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో అండర్‌కవర్ కాప్ సూరిగా, ఆయుధాల అక్రమ రవాణా, కార్టెల్ సామ్రాజ్యంలో తప్పిపోయిన అన్న కోసం వెతికే ఒక కుర్రాడి కథనే కింగ్‌డమ్. ఇక చివర్లో విజయ్ దేవరకొండ డబుల్ రోల్ లో కనిపించి షాక్ ఇచ్చాడు.
దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 82 కోట్ల వసూళ్లను సాధించింది. విజయ్ దేవరకొండ మేకోవర్, విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మేకర్స్ శ్రమను ప్రతిబింబించినప్పటికీ.. కథలోని స్లో పేసింగ్, కథనంలో లోపాల వల్ల ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. నేడు ఈ సినిమా ఏడాది కంప్లీట్ చేసుకోవడంతో సోషల్ మీడియాలో #1YearForKingdom ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులు సినిమాలోని గ్రాండ్ విజువల్స్, విజయ్ ఆటిట్యూడ్, యాక్షన్ సీక్వెన్స్‌లను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే అదే సమయంలో, సరైన స్క్రిప్ట్ పడి ఉంటే కింగ్‌డమ్ బాక్సాఫీస్ వద్ద మరో స్థాయిలో ఉండేదని, కథలో బలం లేకపోవడమే సినిమాకు మైనస్ అయిందని సినీ ప్రియులు తమ నిజాయితీతో కూడిన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది మాత్రం ప్లాప్ సినిమాని ట్రెండ్ చేస్తున్నారెందుకురా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇది హిట్ అయ్యి ఉంటే సీక్వెల్ అడిగేవారేమో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం విజయ్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాలతోనైనా రౌడీ బాయ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.