వీడియో లీక్‌.. 'రణబాలి'పై అమాంతం పెరిగిన‌ అంచనాలు!

ABN , Publish Date - Apr 02 , 2026 | 09:51 PM

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్వ‌క‌త్వంలో నటిస్తున్న రణబాలి చిత్రానికి సంబంధించిన ఒక చిన్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ranabali

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) ద‌ర్వ‌క‌త్వంలో నటిస్తున్న రణబాలి (Ranabaali) చిత్రానికి సంబంధించిన ఒక చిన్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అనూహ్యంగా బయటకు వచ్చిన ఈ లీక్డ్ వీడియోలో విజయ్ మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.

గుర్రపు స్వారీ చేస్తూ, రౌద్రంగా పక్కా రాయలసీమ యాసలో ఆయన చెబుతున్న డైలాగులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా “నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..” అనే డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. విజయ్ బాడీ లాంగ్వేజ్, ఆ అగ్రెషన్ చూస్తుంటే పక్కా కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమా నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. భారత చరిత్రలోనే అత్యంత విషాదకరమైన కాలంగా భావించే 1876-1878 నాటి 'మహా కరువు' సమయంలో సాగే కథ ఇది. రాయలసీమ ప్రాంతంలో ఆ దారుణమైన పరిస్థితుల మధ్య ప్రజలు తమ మనుగడ కోసం చేసిన వీరోచిత పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

చరిత్రను, కల్పిత ఉద్వేగాలను జోడించి దర్శకుడు ఈ పీరియడ్ డ్రామాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, లోతైన భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో ఉండనున్నాయి.

వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం. తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టే సరైన సినిమా కోసం చూస్తున్న తరుణంలో 'రణబలి' అతనికి ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. లీకైన విజువల్స్ చూస్తుంటే చిత్ర యూనిట్ ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో కష్టపడుతున్నట్లు స్పష్టమవుతోంది.

దీనికి తోడు విజయ్ - రష్మిక మందన్న (Rashmika Mandanna) కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వివాహం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కలిసి కనిపిస్తున్న తొలి చిత్రం కావడంతో, ప్రేక్షకుల్లో సహజంగానే ఒక రకమైన క్యూరియాసిటీ నెలకొంది.

సాధారణంగా సినిమాలకు సంబంధించిన కీ-సీన్స్ లీక్ కావడం అనేది టీమ్‌కు తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే ఇది థియేటర్లలో చూడాల్సిన అనుభూతిని దెబ్బతీస్తుంది. కానీ 'రణబలి' విషయంలో మాత్రం ఈ లీక్ ఒక వరంగా మారిందని చెప్పవచ్చు.

విజయ్ ప్రస్తుత ఫామ్, దర్శకుడికి పెద్దగా క్రేజ్ లేకపోవడం వల్ల సినిమాపై అప్పటివరకు పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఈ క్లిప్ బయటకు రావడంతో సినిమాపై ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. మరి ఈ భారీ అంచనాలను అందుకుని 'రణబలి' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Updated Date - Apr 02 , 2026 | 10:04 PM