Aadarsha Kutumbam: చూపు లేకపోయినా.. వేట తప్పదు! ‘రా ఏజెంట్’గా వెంకీ
ABN, Publish Date - May 10 , 2026 | 04:20 PM
త్రివిక్రమ్ శ్రీనివాస్.. వెంకీతో చేస్తున్న తొలి చిత్రం ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. 47’. అటు వెంకీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కలయికలో రూపొందుతున్న చిత్రం ఆదర్శకుటుంబం – హౌస్ నెం. 47 (Aadarsha Kutumbam). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు క్లాసిక్ హిట్స్‌గా నిలవడమే కాకుండా, వెంకీ బాడీ లాంగ్వేజ్‌కు త్రివిక్రమ్ డైలాగులు చక్కగా సరిపోతాయని నిరూపించాయి. అయితే, ఈ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా మాత్రమే పనిచేశారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా మారిన తర్వాత వెంకీతో చేస్తున్న తొలి చిత్రం ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. 47’ కావడంతో, అటు వెంకీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో వెంకటేశ్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్‌లో వెంకీ ఒక శక్తివంతమైన ‘రా ఏజెంట్’ గా కనిపిస్తారని సమాచారం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ పాత్రకు దృష్టి లోపం ఉంటుందట. ఒక ఏజెంట్‌గా ఉంటూనే తనకున్న ఈ లోపాన్ని అధిగమించి, శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు? ఎలాంటి సాహసోపేతమైన ఛేజింగ్‌లు చేశాడు? అనే కోణంలో త్రివిక్రమ్ డ్రామాను ఫుల్ ఎంటర్టైనింగ్ వేలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్, వినోదం సమపాళ్లలో ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట మాటల మాంత్రికుడు.
మరోవైపు సినిమాలో ప్రముఖ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ (Divyendu Sharma) ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధృవీకరించడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. దివ్యేందు శర్మ ఇప్పటికే రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వెంటనే వెంకటేష్-త్రివిక్రమ్ వంటి పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకోవడం విశేషం. ఆయన నటన సినిమాకు ఒక కొత్త వెయిట్ తీసుకొస్తుందని భావిస్తున్నారు.
ఈ చిత్రంలో కథానాయికగా 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) నటిస్తోంది. ఒక పక్క ఫ్యామిలీ ఎమోషన్స్, మరోపక్క క్రైమ్ డ్రామా మేళవించిన కథ కావడంతో త్రివిక్రమ్ ప్రతి సన్నివేశాన్ని చాలా నాణ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, వెంకటేశ్ టైమింగ్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం వేగంగా ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. షూటింగ్ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చేలా దర్శకుడు శ్రమిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోంది. పండుగ సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ ఫ్యామిలీ డ్రామాలు దసరా వంటి పండుగలకు ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మరి ఈ విభిన్నమైన ‘ఏజెంట్’ బ్యాక్‌డ్రాప్ కథతో వెంకీ-త్రివిక్రమ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటారో చూడాలి.