సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అన్న హీరో, చెల్లి ప్రొడ్యూసర్, బాబాయ్‌ క్లాప్‌!

ABN, Publish Date - Mar 28 , 2026 | 09:42 AM

వరుణ్‌ తేజ్‌ హీరోగా నిహారిక నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. 'బరి' పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌ ముఖ్యఅతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.

Bari Movie opening

'కమిటీ కుర్రోళ్ళు' సినిమాతో నిర్మాతగా తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నిహారిక కొణిదెల మలి చిత్రంగా 'రాక్షస'ను నిర్మించారు. సంగీత్ శోభన్‌, నయన్ సారికగా జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది. అయితే ఈ లోగానే ఆమె తన అన్నయ్య వరుణ్ తేజ్‌తో పాన్ ఇండియా మూవీని ప్రారంభించారు. ఈ చిత్రానికి 'బరి' అనే టైటిల్‌ పెట్టారు. శనివారం జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హాజరై, క్లాప్‌ కొట్టి చిత్ర బృందానికి ఆశీస్సులు అందించారు.

ఈ సందర్భంగా నిర్మాత నిహారిక మాట్లాడుతూ, 'మా నాన్న తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీశారు. బ్రదర్‌తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమౌతోంది. మా అన్నయ్య వరుణ్‌ తేజ్‌తో ఈ సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి బాబాయ్‌ వచ్చి ఆశీస్సులు అందించడం చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తోంది' అని అన్నారు.


'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న 'బరి' మూవీ సైతం సంక్రాంతి బరిలో నిలుస్తుందని నిహారిక తెలిపారు. చిత్రం ఏమంటే... ఇప్పటికే వచ్చే సంక్రాంతికి కొన్ని సినిమాల విడుదలను ప్రకటించారు. మరీ ముఖ్యంగా వెంకటేశ్‌, కళ్యాణ్‌ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా 2027 సంక్రాంతికే విడుదల కాబోతోంది. గతంలో వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 2, ఎఫ్‌ 3' సినిమాలు రూపొందించారు. ఇప్పుడు వెంకీ, అనిల్ రావిపూడి సినిమాకే పోటీగా 'బరి' దిగబోతోంది. అలానే అక్కినేని నాగార్జున 101వ సినిమా సైతం సంక్రాంతికే వస్తుందని అంటున్నారు.


క్రీడా మైదానంలో మెగా హీరోలు!

విశేషం ఏమంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మెగా హీరో రామ్ చరణ్‌ మూవీ 'పెద్ది' కూడా క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే. కుస్తీ పోటీలతో పాటు ఆ సినిమాలో క్రికెట్‌ కూడా ప్రధాన క్రీడగా ఉంది. ఇక వరుణ్‌ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ మూవీ గతంలోనూ చేశారు. కిక్ బాక్సింగ్‌ నేపథ్యంలో వరుణ్‌ తేజ్ 'గని' మూవీలో నటించారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దానిని పట్టించుకోకుండా ఇప్పుడు గ్రామీణ నేపథ్యంలో వాలీబాల్ క్రీడకు ప్రాధాన్యమున్న 'బరి' చిత్రంలో నటిస్తున్నారు.

'తాను చెల్లిని కానీ, చెల్లి తనని కానీ సినిమా చేయమని ఎప్పుడూ అడగలేదని, కాకపోతే నిహారిక ఎంపిక చేసుకునే కథల మీద తనకు నమ్మకం ఉందని, అందుకే ఈ సినిమా చేస్తున్నాన'ని వరుణ్‌ తేజ్ తెలిపారు.

Updated Date - Mar 28 , 2026 | 12:53 PM