Mahesh Babu: వారణాసి.. అసలు విషయం ఇదే.. రివీల్ చేసిన స్కై-బ్లూ సినిమాటిక్స్
ABN, Publish Date - Aug 08 , 2026 | 01:57 PM
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.
సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh babu), దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై (varanasi) రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2026 అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ‘వారణాసి’ అధికారిక బ్రాండ్ పార్ట్‌నర్ స్కై-బ్లూ సినిమాటిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో సినిమా కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. దీంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.
2027లో ప్రపంచం ఓ భారీ ప్రమాదాన్ని ఎదుర్కోబోతోంది. ‘శాంభవి’ అనే భారీ గ్రహశకలం వారణాసిని ఢీకొట్టే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ ముప్పును అడ్డుకునేందుకు ఓ పురాతన కాస్మిక్ కళాఖండాన్ని కనిపెట్టే మిషన్‌లోకి పురావస్తు శాస్త్రవేత్త, సాహస అన్వేషకుడు రుద్ర (మహేశ్ బాబు) అడుగుపెడతారు. ఈ మిషన్‌లో రుద్రకు ధైర్యవంతురాలైన చరిత్రకారిణి, నిపుణురాలైన షూటర్ మందాకిని (ప్రియాంక చోప్రా) తోడవుతారు. వీరిద్దరి అన్వేషణ ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా మంచు ప్రాంతాలు, యూరప్ వరకు సాగుతుంది. మరోవైపు టెక్నాలజీలో నిపుణుడైన విలన్ కుంభ (పృథ్వీరాజ్ సుకుమారన్) వారిని వెంటాడుతుంటాడు. ఈ ప్రమాదాన్ని అడ్డుకునే కీలక రహస్యం మాత్రం వారణాసి నగరంలోని మైథలాజికల్ పాస్ట్ లో దాగి ఉంటుంది' అని కథ సారాంశంగా చెప్పుకొచ్చారు. పురాణాలు, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, అడ్వెంచర్ అంశాల కలయికగా రాజమౌళి ఈ కథను ఎలా తెరపై ఆవిష్కరించారన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.