‘ఇరుముడి’కి.. జనం హారతులు! చూడాల్సిందే.. సందీప్ రెడ్డి వంగా రివ్యూ వైరల్
ABN , Publish Date - Aug 21 , 2026 | 03:08 PM
‘ఇరుముడి’ సినిమా భక్తి భావన, భావోద్వేగాల అద్భుతమైన కలయికగా నిలిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసించారు.
‘ఇరుముడి’ (Irumudi) సినిమా భక్తి భావన, భావోద్వేగాల అద్భుతమైన కలయికగా నిలిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రశంసించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సందీప్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మాస్ మహారాజా రవితేజ, బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ ప్రేక్షకులను మరిచిపోలేని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ తరం ప్రేక్షకులకు ‘ఇరుముడి’ ఒక ప్రత్యేకమైన చిత్రమని, సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆ భావోద్వేగం మనసులో నిలిచిపోతుందని అన్నారు. ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరిన సందీప్ రెడ్డి వంగా.. సినిమా సూపర్‌హిట్ కావడం పట్ల చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
హారతులతో ఫాన్స్ సందడి..
సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన భక్తి భావనను కలిగిస్తున్నాయి. అయ్యప్ప స్వామికి సంబంధించిన సన్నివేశాలు తెరపై కనిపించిన సమయంలో అభిమానులు స్క్రీన్‌లకు హారతులు ఇస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. మరికొందరు థియేటర్‌లోనే భజనలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.‘మల్లెపూల పల్లకి’ పాట మొదలైన సమయంలో థియేటర్లలో వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతోంది. పాటకు అభిమానులు స్క్రీన్ ముందుకు వెళ్లి డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు.