ముంచుకొస్తున్న 'ఉస్తాద్' తుఫాన్.. ఫ్యాన్స్ గెట్ రెడీ! ఉగాదికి రచ్చరచ్చే.. ఊచకోతే
ABN, Publish Date - Mar 05 , 2026 | 12:34 PM
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్' విడుదలలో మార్పు చోటు చేసుకుంది.
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా విడుదలలో మార్పు చోటు చేసుకుంది. తాజా షెడ్యూల్ ప్రకారం ‘ఉస్తాద్’ ఉగాదికే రానున్నాడు. తెలుగు సంవత్సరాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నెల 19న రావలసిన ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడటంతో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఒక వారం ముందుకు వచ్చినట్లు తెలిసింది.
‘టాక్సిక్’ విడుదల వాయిదా పడటంతో ఉస్తాద్ భగత్‌సింగ్ విడుదల ముందుకొచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో రెండ్రోజులుగా చర్చ నడుస్తోంది. అయితే అనుకున్నట్లే ఈ చిత్రం వారం రోజులు ముందుకు వచ్చింది. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, శ్రీలీల కథానాయికలు.
ఇద్దరు సంగీత దర్శకులు..
'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు పని చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు మైత్రీ మూవీమేకర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘దేఖ్ లేంగే.., ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు చక్కని ఆదరణ పొందాయి. మిగతా పాటలు అంతకుమించి ఉంటాయి. ఈ సినిమాలో అన్ని పాటలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. నేపథ్య సంగీతం కోసం రీల్స్ ఖరారు చేసి దేవిశ్రీప్రసాద్‌కి పంపడంలో ఆలస్యమైంది.
ఆయన ఇప్పటికే అంగీకరించిన ఇతర ప్రాజెక్ట్‌ల కారణంగా ఈ సినిమాకి మరింత సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘గబ్బర్‌సింగ్’’ తర్వాత పవన్, హరీశ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి పనిచేస్తున్న ఈ సినిమా పవన్ అభిమానులకు మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటుంది’ అని మైతీ సంస్థ పేర్కొంది.