హరీష్ శంకర్.. ఎంత పనైంది! ఇప్పట్లో.. కోలుకునేనా
ABN, Publish Date - Mar 23 , 2026 | 08:17 PM
దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. వరుస పరాజయాలు ఆయనను తీవ్ర ఇబ్బందుల్లో నెట్టాయి.
దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. వరుస పరాజయాలు ఆయనను తీవ్ర ఇబ్బందుల్లో నెట్టాయి. మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) భారీ పరాజయం తర్వాత, ఆయన తన ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)పైనే పెట్టుకున్నారు. కానీ, ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద వైఫల్యంగా మిగిలిపోయే దిశగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు గబ్బర్ సింగ్ (Gabbar Singh) వంటి బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం నందమూరి బాలకృష్ణ (Balakrishna) తో చర్చలు జరిపారు. ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి, 2027 సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేశారు. వీరిద్దరి కలయికలో ఒక మాస్ ఎంటర్టైనర్ వస్తుందని తెలియడంతో మొదట్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి వస్తున్న పబ్లిక్ రెస్పాన్స్‌తో పాటు బాక్సాఫీస్ వసూళ్లను గమనించిన బాలకృష్ణ, ఈ ప్రాజెక్ట్‌తో ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, గత కొన్నేళ్లుగా జాప్యాలు, అస్థిరమైన ఫలితాలతో సతమతమవుతున్న హరీష్ శంకర్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.
మరోవైపు, బాలకృష్ణ ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya)తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ కంటే వివేక్ ఆత్రేయనే నేటి కాలపు అభిరుచులకు తగ్గట్టుగా మెరుగైన సినిమాను అందించగలరని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బాలయ్య వంటి స్టార్ హీరో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకొని వివేక్ ఆత్రేయ వైపు మొగ్గు చూపడం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పరిణామం హరీష్ శంకర్ కెరీర్ గ్రాఫ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హరీష్ శంకర్ కొత్త కథలపై దృష్టి సారించి, బలమైన కంబ్యాక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తలపెట్టిన ప్రాజెక్టులు ఆలస్యం కావడం లేదా ఫ్లాప్ అవ్వడంతో, ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగు అత్యంత కీలకంగా మారింది. తన పాత వైభవాన్ని తిరిగి పొందాలంటే ఇప్పుడు ఆయనకు ఒక సాలిడ్ హిట్ ఎంతైనా అవసరం. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫలితం తర్వాత హరీష్ శంకర్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయోనని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.