సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనుమ‌తి లేకుండా.. ఫొటోల వాడ‌కం! హైకోర్టులో.. తమన్నాకు ఎదురుదెబ్బ

ABN, Publish Date - Apr 17 , 2026 | 07:05 AM

స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Tamannaah

దక్షిణాది స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia)కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన అనుమతి లేకుండా ఫోటోలను కమర్షియల్ యాడ్స్ కోసం వినియోగించారంటూ 'పవర్ సోప్స్ లిమిటెడ్' సంస్థపై ఆమె వేసిన రూ.1 కోటి నష్టపరిహారం పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో తగిన ఆధారాలు చూపడంలో ఆమె విఫలమయ్యారని పేర్కొంటూ, గతంలో వచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆమె వేసిన అప్పీల్‌ను ధర్మాసనం తిరస్కరించింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం 2008లో జరిగిన ఒక ఒప్పందం. అప్పట్లో సబ్బుల తయారీ సంస్థతో తమన్నా ఒక ఏడాది పాటు అడ్వర్టైజ్‌మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆ గడువు అక్టోబర్ 2009తో ముగిసింది. అయితే, ఒప్పందం ముగిసిన తర్వాత కూడా 2010 నవంబర్ నుంచి 2011 ఫిబ్రవరి మధ్య తన ఫోటోలను సబ్బు కవర్లు, బ్యానర్లు, పోస్టర్లపై అక్రమంగా వాడుకున్నారని ఆమె ఆరోపించారు. దీనివల్ల తనకు ఆర్థికంగా నష్టం కలగడంతో పాటు ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొంటూ 2011లో ఆమె కోర్టును ఆశ్రయించారు.

గతంలో 2017లో ఒక సింగిల్ జడ్జి ఈ కేసును విచారించి, ఆరోపణలను నిరూపించడానికి సరైన సాక్ష్యాలు లేవని స్పష్టం చేస్తూ తమన్నా వాదనను తోసిపుచ్చారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె డివిజన్ బెంచ్‌కు వెళ్లగా ధర్మాసనం 2026 ఏప్రిల్ 16న తుది తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి బలమైన కారణాలు కనిపించడం లేదని న్యాయమూర్తులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ఒప్పందం గడువు ముగిశాక కూడా సంస్థ ఆమె చిత్రాలను వాడిందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. కేవలం ఆరోపణలు చేయడం సరిపోదని, చట్టపరంగా పరిహారం పొందాలంటే బలమైన సాక్ష్యాధారాలు అవసరమని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుతో పదేళ్లకు పైగా సాగిన తమన్నా న్యాయపోరాటం ముగిసినట్లయింది. ఎండార్స్‌మెంట్లు, బ్రాండ్ ఒప్పందాల విషయంలో నిబంధనలు, సాక్ష్యాలు ఎంత కీలకమో ఈ కేసు సినీ పరిశ్రమకు మరోసారి స్పష్టం చేసింది.

Updated Date - Apr 17 , 2026 | 07:44 AM