సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వ‌చ్చే సంక్రాంతి.. పోటీ మాములుగా లేదుగా

ABN, Publish Date - Feb 09 , 2026 | 09:00 AM

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటి తెలుగు పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. సంక్రాంతి సీజన్‌కున్న మార్కెట్‌ను భారీగా క్యాష్‌ చేసుకున్నాయి.

tollywood

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటి తెలుగు పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. సంక్రాంతి సీజన్‌కున్న మార్కెట్‌ను భారీగా క్యాష్‌ చేసుకున్నాయి. ఇదే ఊపును వచ్చే సంక్రాంతికీ కొనసాగించేందుకు పలువురు టాలీవుడ్‌ హీరోలు ఇప్పుడే సిద్ధమైపోయారు. ఇందులో మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్నడూ లేని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్‌ ఫోర్‌ సీనియర్‌ హీరోలు ఈ పండగకు పోటీ పడడమే.

మరోసారి.. చిరు.. బాలయ్య పోటీ!

‘మన శంకర వరప్రసాద్‌ గారు’తో ఈ సంక్రాంతికి సూపర్‌ హిట్‌ను అందుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తోంది చిత్రబృందం. మరోవైపు, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవలే విడుదలైన ‘అఖండ 2: తాండవం’తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించనున్న పీరియాడిక్‌ డ్రామా సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.

ఇదే జరిగితే తెలుగు బాక్సాఫీస్‌ వద్ద అత్యంత ఆసక్తికరమైన పోటీని మరోసారి ప్రేక్షకులు చూడడం ఖాయం. ఎందుకంటే చిరు, బాలయ్య ఇప్పటికే చాలా సార్లు సంక్రాంతి బరిలో నిలిచారు. 2023లో కూడా బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమాలు పండగకి విడుదలవ్వగా, రెండూ విజయం సాధించడం గమనార్హం. చిరంజీవి, బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకూ దర్శకులు వారిద్దరే కావడం విశేషం.

మరో సీనియర్‌ కథానాయకుడు వెంకటేశ్ (Venkatesh Daggubati) ప్రస్తుతం అనిల్‌ రావిపూడితో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ చిత్రం కూడా సంక్రాంతికి ముస్తాబవుతున్నదే. తాజాగా అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) కూడా ఈ రేసులోకి రావడంతో వచ్చే ఏడాది సంక్రాంతి సీనియర్లదే అని అనిపిస్తోంది. వీరితో పాటు ‘నారీ నారీ నడుమ మురారీ’తో ఈ పండగకి హిట్‌ అందుకున్న శర్వానంద్‌, వచ్చే ఏడాది కూడా సంక్రాంతి బరిలో తన సినిమాను తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. శ్రీనువైట్ల ఈ చిత్రానికి దర్శకుడు. ఇంతమంది హీరోలు ఒకే సీజన్‌ను లక్ష్యం చేసుకోవడంతో, సంక్రాంతి సమరం మరింత ఆసక్తికరంగా మారనుంది.

Updated Date - Feb 09 , 2026 | 09:21 AM