ఇండియాలో ఇద్దరు హీరోల వయసే వెనక్కి వెళుతోంది: త్రివిక్రమ్
ABN , Publish Date - Aug 15 , 2026 | 10:24 PM
భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సక్సెస్ మీట్‌లో ఆయన స్పీచ్ వైరల్ అవుతోంది.
భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). తాజాగా ఆయన సూర్య (Suriya) హీరోగా నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ థియేటర్లలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వెంకీ తనకు చెప్పినప్పటి నుంచి ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కథ అని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఇంత చక్కగా సినిమా తీసి విజయం సాధించినందుకు చిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. సూర్యతో కలిసి కచ్చితంగా ఒక సినిమా చేయాలనుకుంటున్నానని, ఆయనకు నచ్చే కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. సూర్యతో సినిమా చేయాలని తన భార్య నుంచి ఒక డిమాండ్ ఉందని తెలిపారు. సాధారణంగా సితార బ్యానర్‌లో జరిగే షూటింగ్‌లకు రాని తన భార్య, సూర్యను కలవడానికి స్వయంగా సెట్‌కి వచ్చి ఫొటో తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు.
సూర్య, మహేష్ బాబుల ఏజ్ లెస్ చార్మ్
భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరని, ఒకరు సూర్య అయితే మరొకరు మహేష్ బాబు అని కొనియాడారు. ‘గజిని’ చిత్రంలోని సంజయ్ రామస్వామి క్యారెక్టర్ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పాత్ర అని, అలాంటి పవర్‌ఫుల్ అండ్ క్లాస్ లుక్‌ని మళ్లీ దర్శకుడు వెంకీ చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారని ప్రశంసించారు. ఈ చిత్రానికి సూర్య, రాధిక, రవీనా టాండన్, మమితా బైజు నలుగురు నాలుగు స్తంభాల్లా నిలిచారని చెప్పారు. బయట ఎంతో డైనమిక్‌గా ఉండే రవీనా టాండన్ ఇందులో చాలా ఎమోషనల్ అండ్ గొప్ప పాత్రను ఎంతో గౌరవప్రదంగా పోషించారని, మమితా బైజు కూడా ఎనర్జిటిక్ పాత్రతో మెప్పించారని అన్నారు. అలాగే సూర్య అండర్ ప్లే పర్ఫార్మెన్స్ అద్భుతమని కొనియాడారు.
ఒక్క ఏడాది వ్యవధిలో ‘కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి రెండు పూర్తి విభిన్న సినిమాలు చేశారని, సూర్య ప్రయాణం మళ్ళీ కొత్తగా మొదలుపెట్టినట్లుగా అనిపిస్తుందన్నారు, సూర్య నుంచి నేర్చుకోవాల్సింది వినయమని, సూర్య తండ్రి శివకుమార్ అంటే నాకెంతో గౌరవమని తెలిపారు. సూర్య, కార్తి తెలుగు హీరోలేనని.. ప్రస్తుతం భాషా ప్రాంతీయ హద్దులు చెరిగిపోయి ‘ఇండియన్ సినిమా’ ఒక్కటిగా మారిందని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ వేదికపై మన భారతీయ సినిమా సత్తా చాటాల్సిన సమయమని స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులే నిజమైన హీరోలని చెబుతూ.. వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పవన్, చరణ్.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..
‘ది ఇండియన్ బార్డర్’ నుంచి ‘జిందా రహేన్ తో డ్యూటీ’ సాంగ్ విడుదల
బోనాలు.. ట్రోలింగ్‌పై ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో వైరల్!