దర్శకుడు త్రివిక్రమ్.. ‘ఫంకీ’ చూసి సూచనలు ఇచ్చారు
ABN , Publish Date - Feb 11 , 2026 | 09:32 AM
జాతి రత్నాలు చిత్రంతో బాక్సాఫీసు వద్ద నవ్వుల జాతర చేసిన దర్శకుడు కేవీ అనుదీప్ ఇప్పుడు ‘ఫంకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) చిత్రంతో బాక్సాఫీసు వద్ద నవ్వుల జాతర చేసిన దర్శకుడు కేవీ అనుదీప్ (KV Anudeep) ఇప్పుడు ‘ఫంకీ’ (Funky) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. విశ్వక్ సేన్ (Vishwak Sen), కయాదు లోహర్ (Kayadu Lohar) జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అనుదీప్ మీడియాతో ముచ్చటించారు.
నా సినిమాల్లో లాజిక్ ఉండదు అనే విమర్శలు ఉన్నాయి. కామెడీ ఎక్కువగా ఉండడం వల్ల అనిపించి ఉండొచ్చు. కానీ ‘ఫంకీ’లో లాజిక్ తో కూడిన హాస్యం ఉంటుంది. సినిమా పరిశ్రమ నేపథ్యంలో సాగే ఈ కథలో దర్శకుల జీవితాల్లోని సరదా సంఘటనలను, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను జోడించి రూపొందించాం. ఈ చిత్రంలో హీరో విశ్వక్ సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారని తెలిపారు.
ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే ప్రముఖ దర్శకులు హరీశ్ శంకర్, కల్యాణ్ శంకర్, అగ్ర నిర్మాతలు దిల్‌రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. కథలో భాగంగానే ఈ పాత్రలు వస్తాయి, సహజమైన హాస్యాన్ని పండిస్తాయి. ఇది పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా చూసి కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.