పర్సంటేజ్ సిస్టమ్ కోసం కమిటీ.. టాలీవుడ్ రచ్చకు బ్రేక్!
ABN , Publish Date - May 15 , 2026 | 07:53 PM
‘పర్సంటేజ్ సిస్టమ్’ అమలుకు సాగిన మాటల యుద్ధాలు ముగిశాయి. టాలీవుడ్ పెద్దలు ముందుకొచ్చారు. శుక్రవారం ఛాంబర్‌లో సమావేశమై, సమస్య పరిష్కారానికి ఓ కమిటీని వేశారు.
‘పర్సంటేజ్ సిస్టమ్’ (Percentage System) అమలుకు సాగిన మాటల యుద్ధాలు ముగిశాయి. టాలీవుడ్ పెద్దలు ముందుకొచ్చారు. శుక్రవారం ఛాంబర్‌లో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారం కోసం నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అతి త్వరలోనే తగిన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఇంతకూ ఎవరెవరు ఏమన్నారో చూద్దాం...
21 మందితో కమిటీ...!
ప్రస్తుతం పలు థియేటర్స్‌పై అమలులో ఉన్న ‘రెంటల్ సిస్టమ్’ను వ్యతిరేకిస్తూ ‘పర్సంటేజ్ సిస్టమ్’ కోరుతూ ఎగ్జిబిటర్స్ నిర్మాతలను న్యాయం చేయమని కోరారు. అయితే నిర్మాతలు మాత్రం ‘అన్ని థియేటర్స్‌కు ఒకే తీరున పర్సంటేజ్ సిస్టమ్ సబబు కాదు’ అని అన్నారు. మీడియా మీట్స్‌తో హీటెక్కిన ఈ వివాదానికి తగిన పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ.. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ శుక్రవారం ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ‘పర్సంటేజ్ సిస్టమ్’ అమలుపై అందరూ ఓ తీర్మానికి వచ్చారు. ముందుగా ఒక్కో సెక్టార్ నుండి 7 మంది సభ్యులతో మొత్తం 21 మెంబర్స్ ఉన్న కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అందరం సుహృద్భావ వాతావరణంలో చర్చించుకున్నామని, ‘పర్సంటేజ్ సిస్టమ్’కు ఓకే అన్నారని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు.
అందరికీ ఆమోదయోగ్యంగా...
నిర్మాతల్లో కొందరు ఎగ్జిబిటర్స్‌కు మద్దతుగా ఉన్నారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు మాత్రం ‘పర్సంటేజ్ సిస్టమ్’కు ససేమిరా అన్నారు. అయితే శుక్రవారం జరిగిన చర్చల్లో అందరూ ‘పర్సంటేజ్ సిస్టమ్’కు ఓకే అనడం మేలి మలుపు. అయితే దీనిని ఓ పద్ధతి ప్రకారం అమలు చేయడానికి వేసిన కమిటీలో నిర్మాతల నుంచి..
వై. సుప్రియ,
బి. బాపినీడు,
మైత్రీ రవిశంకర్ వై,
చెరుకూరి సుధాకర్,
టి. ప్రసన్నకుమార్,
జి. శ్రీనివాస్ కుమార్ (ఎస్కేయన్),
వై సురేందర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
నిర్మాతల కమిటీ వేసే విషయంలో కొంత వాగ్వివాదం జరగటం గమనార్హం. ఇక ఎగ్జిబిటర్స్ నుంచి..
కె. అనుపమ్ రెడ్డి,
టి, బాలగోవిందరాజ్,
వి. ప్రతాప్ రెడ్డి,
జి. వీరనారాయణ బాబు,
పి. శ్రీనివాసరావు,
కె. వంశీ కిశోర్ సభ్యులు కాగా, విజయేందర్ రెడ్డిని ‘ఆప్షనల్’గా పెట్టారు.
డిస్ట్రిబ్యూటర్స్ నుంచి..
డి. విష్ణు మూర్తి,
వి. వీరి నాయుడు,
ఎన్. సుధాకర్ రెడ్డి,
ముత్యాల రామదాసు,
ఎన్. నాగార్జున,
బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు),
ధీరజ్ మొగిలినేని.. ఎంపికయ్యారు. వీరి ఆధర్యంలోనే ఏ యే థియేటర్స్‌కు ఏ తీరున ‘పర్సంటేజ్’ ఇవ్వాలనే విధివిధానాలను రూపొందిస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగానే పరిష్కారం ఉంటుందని ఛాంబర్ అధ్యక్షులు డి.సురేశ్ బాబు తెలిపారు.

‘పర్సంటేజ్ సిస్టమ్’పై గత కొద్ది రోజులుగా సాగుతోన్న వ్యవహారాన్ని కొందరు అదే పనిగా ‘పెద్ది’ రిలీజ్‌ను ఆపడానికే అన్నట్టుగా చిత్రీకరించారు. అయితే ‘పెద్ది’ సజావుగా విడుదలవుతుందని, ఎలాంటి అడ్డంకులు ఉండవని సమావేశంలో పాల్గొన్నవారు చెబుతున్నారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొనే క్రమంలో స్టార్స్ రెమ్యూనరేషన్స్ తగ్గిస్తే మంచిదన్న చర్చ సాగింది. ఈ విషయంలో తామేమీ చేయలేమని నిర్మాతలు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఆరంభంలో వాదోపవాదాలు సాగినా, మొత్తానికి సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుందనే అందరూ అంటున్నారు. ఎగ్జిబిటర్స్‌కు సపోర్ట్‌గా నిలచిన చదలవాడ శ్రీనివాసరావు అదే మాటన్నారు. అలాగే తెలంగాణ చలనచిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు కూడా పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘పర్సంటేజ్’ కోసం ఏర్పాటైన కమిటీ శుక్రవారం సాయంత్రమే భేటీ అయింది. వారం పది రోజుల్లోపే తగిన పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. మరి ‘పర్సంటేజ్ సిస్టమ్’ ఎప్పటి నుంచి అమలవుతుంది? దాని విధి విధానాలు ఎలా ఉంటాయో? చూడాలి.
ఇవి కూడా చదవండి:
మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!
Varanasi: ‘వారణాసి’ కోసం మైత్రీ వేట.. టెంప్టింగ్ ఆఫర్!
Tom Cruise: తెలుగు యువ దర్శకుడితో టామ్ క్రూజ్ భారీ చిత్రం!
నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!