స్టార్ హీరోల వరుస గాయాలు.. ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్
ABN, Publish Date - Jul 28 , 2026 | 07:56 AM
టాలీవుడ్ అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ వరుసగా గాయాల బారిన పడటం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మన హీరోలు రికార్డులు బద్దలు కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. వెండితెరపై వారు చేసే సాహసాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి థియేటర్లలో ఈలలు, గోలలు వేస్తుంటాం. కానీ ఆ రెండున్నర గంటల వినోదం వెనుక వారు పడే కష్టం, ఎదుర్కొనే ప్రమాదాలు చాలా ఉంటాయి. గత కొంత కాలంగా టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడుతుండటం ఇండస్ట్రీలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. టాప్ స్టార్స్ అంతా ఒకరి తర్వాత ఒకరు సర్జరీలు చేయించుకుంటుండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
ముందుగా మెగా కాంపౌండ్ విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భుజానికి తీవ్ర గాయం కావడంతో ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఒక పక్క రాజకీయాలు, మరోపక్క సినిమాలతో బిజీగా గడుపుతున్న పవన్‌కు ఈ సర్జరీ కొంత బ్రేక్ ఇచ్చింది. అలాగే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా తాజాగా ఆసుపత్రి పాలయ్యారు. ఎవరూ ఊహించని విధంగా కోయంబత్తూరులో రామ్ చరణ్ చేతి మణికట్టుకు సర్జరీ జరగడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. పెద్ది (Peddi) సినిమా షూటింగ్ సమయంలో రామ్‌చరణ్ కంటికి దెబ్బ తగలడం, దాని నుంచి రికవరీ అయిన తరువాత పహిల్వాన్ సీన్స్ తీస్తున్న సమయంలో చేతి మణికట్టుకు దెబ్బ తగలడం కొంత ఇబ్బంది కరంగా మారింది. ఆ నొప్పితోనే అటు షూటింగ్‌కు, ఇటు ప్రమోషన్స్‌లో పాల్గొనడం అభిమానులను కలిచివేసింది. ఈ కోవలోనే మెగా ప్రిన్స్ సైతం సర్జరీ జరుగగా చేతి కర్ర సాయంతో నడవడం ఇటీవల వైరల్ అయింది కూడా. హీరోలు ఇలా తమ సినిమాల పట్ల చూపిస్తున్న డెడికేషన్‌కు ఇది ఒక నిదర్శనం.
ప్రస్తుతం చరణ్ సర్జరీ తరువాత పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఇక నందమూరి అభిమానులకు కూడా వరుస షాక్‌లు తగులుతున్నాయి. నటసింహం బాలకృష్ణ (nandamuri balakrishna) తన తాజా చిత్రం NBK111 షూటింగ్‌లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అయితే యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో ఆయన మోకాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఇంకోవైపు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (ntr) పరిస్థితి కూడా భిన్నంగా లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న డ్రాగన్ (dragon) సినిమా షూటింగ్‌లో కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ చేతికి దెబ్బ తగిలింది. దానికి కొంతకాలం బ్రేక్ ఇచ్చి కోలుకున్న తర్వాత ఉత్సాహంగా మళ్లీ షూటింగ్ ప్రారంభించారు. కానీ విచారకరంగా ఈ సోమవారం మళ్లీ ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
హీరోలు వరుసగా గాయపడుతుండటంతో వారి ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి..? రిలీజ్ డేట్స్ మారుతాయా..? అనే కన్ఫ్యూజన్ మొదలైంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలకు ఈ గాయాల వల్ల ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేకపోవడం ప్లస్ అయింది. కానీ డిసెంబర్ టార్గెట్‌గా రిలీజ్ ప్లాన్ చేసుకున్న బాలకృష్ణ NBK111 ప్రాజెక్ట్‌పై మాత్రం కాస్త ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండటంతో, ఈ బ్రేక్ వల్ల షూటింగ్ షెడ్యూల్స్‌పై పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏది ఏమైనా మెగా కుటుంబం నుంచి పవన్, రామ్ చరణ్.. అలాగే నందమూరి కుటుంబం నుంచి బాబాయ్-అబ్బాయిలు బాలయ్య, ఎన్టీఆర్ ఇలా వరుసగా అగ్ర హీరోలు ఒకేసారి సర్జరీల పాలవ్వడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానుల ఆనందం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఫైట్స్ చేస్తున్న ఈ స్టార్ హీరోలందరూ త్వరగా కోలుకోవాలి, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో సెట్స్‌లో అడుగుపెట్టాలని ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు కోరుకుంటున్నాయి.