సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

CBFC: తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది.. బాధ్యత కూడా పెరిగింది

ABN, Publish Date - Nov 22 , 2026 | 10:31 AM

దేశంలో వివిధ బాషల సినిమా పరిశ్రమలకు టాలీవుడ్‌ ఒక దిక్సూచిగా ఉంది. ఒక విధంగా ఇది అదనపు బాధ్యత కూడా’’ అంటారు సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (CBFC) ఛైర్మన్‌ వెంపటి శశిశేఖర్‌.

CBFC Chairman Vempati Sasi Sekhar

‘దేశంలో వివిధ బాషల సినిమా పరిశ్రమలకు టాలీవుడ్‌ ఒక దిక్సూచిగా ఉంది. ఒక విధంగా ఇది అదనపు బాధ్యత కూడా’’ అంటారు సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (CBFC) ఛైర్మన్‌ వెంపటి శశిశేఖర్‌. సెన్సార్‌ సర్టిఫికేషన్‌ ప్రాంతీయ కార్యాలయానికి శాశ్వత ఆర్‌ఓను నియమిస్తామంటున్న శశి మన తెలుగువాడు కావడం విశేషం. ఆయన మీడియాకు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ ఇదే! తెలుగు సినిమాలతో తనకున్న అనుబంధం గురించి, సినిమా పేర్ల విషయంలో కొత్తగా వచ్చిన నిబంధనల గురించి ఆయన ‘నవ్య’కి వివరించారు.

కాలంతో పాటు సినీ పరిశ్రమ కూడా మారింది. కొత్త తరం హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌ బోర్డు పాత్ర ఏమిటి?

‘సెన్సార్‌ బోర్డు’ అనే పదాన్ని మేము వాడటం లేదు. సీబీఎ్‌ఫసీ అంటే సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌. . ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఈ తరహా బోర్డులు ఉన్నాయి. ప్రతి ఏడాది కొన్ని వేల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. వాటిలోని కంటెంట్‌ సమాజంలోని విలువలను, సంప్రదాయాలను గౌరవిస్తోందా? లేదా పౌరులకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులకు భంగం కలిగిస్తోందా? అని చూడటం సర్టిఫికేషన్‌ బోర్డు ప్రధానమైన బాధ్యత. మన దేశంలో సాంస్కృతిక భిన్నత్వం ఉంది. అదే సమయంలో సామాజిక, ఆర్థిక సంక్లిష్టతలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాంస్కృతిక భిన్నత్వాన్ని గౌరవించేలా చూసే బాధ్యత మాపై ఉంది.

తెలుగు సినిమాను, దాని ప్రాధాన్యతను మీరు ఎలా నిర్వచిస్తారు?

భారత్‌ను ప్రపంచ సినీ పటంపై టాలీవుడ్‌ నిలబెట్టింది. తెలుగు సినీ రంగం నుంచి అనేకమంది మహానుభావులు వచ్చారు. ఆధునికతకు అద్దం పడుతూనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు తెలుగు సినీ పరిశ్రమ దిక్సూచిగా నిలుస్తోంది. ఒక కోణం నుంచి చూస్తే ఈ పాత్రను పోషించటంవల్ల టాలీవుడ్‌పై ఒక అదనపు బాధ్యత పడింది. దేశంలోని ఇతరులకు మార్గదర్శిగా నిలబడాల్సిన అవసరం ఉంది.

ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ బోర్డు కొత్త నిబంధనల పై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం?

1990ల్లో ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ కోసం నిబంధనలు విడులయ్యాయి. కొత్త నిబంధనలలో కూడా పెద్దగా మార్పు లేదు. సమాజహితం కోసం కొన్ని మార్పులు మాత్రమే చేశారు. ఉదాహరణకు డ్రగ్స్‌ ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి. డ్రగ్స్‌ తీసుకోవటం ప్రమాదకరమని, చట్టవిరుద్ధమని హెచ్చరికలు వేయమంటున్నాం. ఇక ఏజ్‌ మార్కర్స్‌ (ఏ సినిమా ఏ వయస్సు వారు చూడవచ్చు) విషయంలోనూ మేము స్పష్టంగా ఉన్నాం. పిల్లలకు ఎలాంటి సినిమాలు చూపించాలనే విషయంలో తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. లేకపోతే పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పించటానికి సినీ పరిశ్రమతో పాటు మీడియా కూడా ముందు కు రావాలి. ఈ విషయంలో మాకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

సినిమా పేర్లను చివరి క్షణంలో మార్చే నిబంధనపై కూడా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా!

సినిమా పేర్లు అశ్లీలంగా ఉండకూడదని, మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదనే నిబంధనలు ముందు నుంచి ఉన్నాయి. ఇది కొత్తగా పెట్టిన నిబంధన కాదు. ఈ నిబంధన వల్ల సినిమాలకు బాధ్యతయుతమైన పేర్లు పెట్టాలనే భావన సినిమా తీసేవారికి కలుగుతుంది. 99.9 శాతం నిర్మాతలు బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నారు. మిగిలిన 0.1 శాతం మంది కూడా తమ బాధ్యతను గుర్తిస్తారని అనుకుంటున్నా. మన సినిమాలు ప్రస్తుతం ప్రపంచవాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. దీనివల్ల మనపై బాధ్యత మరింత పెరిగింది. ఈ విషయాన్ని సినిమా పరిశ్రమలోని అందరూ గుర్తించాలి.

ఈ విషయాన్ని మీరు సినిమా ?

పరిశ్రమలో పనిచేసేవారికి చెప్పారా?

చెబుతూనే ఉన్నాం. వారితో ఎప్పటికప్పుడు సంప్రతింపులు జరుపుతూనే ఉంటాం. ఈ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన సీబీఎఫ్‌సీ బోర్డులో అన్ని ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. వీరందరికీ పరిశ్రమతో చాలా కాలంగా అనుబంధం ఉంది. వీరందరూ ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా మేము సినీ పరిశ్రమలోని సభ్యులతో మాట్లాడుతూనే ఉంటాం. మన దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ప్రపంచశక్తిగా ఎదగాలన్నదే మా లక్ష్యం.

ఈ మధ్య ఐడీల విషయంలో జాప్యం జరుగుతోందనే వార్తలు వచ్చాయి. ఇలాంటివి మీ దృష్టికి వచ్చాయా?

మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే మేము టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఏడాది మన దేశంలో సుమారు 3 వేల సినిమాలు, 15 వేల షార్ట్స్‌, ట్రైలర్స్‌, యాడ్స్‌ సర్టిఫికేషన్‌ కోసం వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ చూసి మేము సర్టిఫికెట్లు జారీ చేస్తూ ఉంటాం. ఇది ఒక విధంగా చాలా పెద్ద పని.

ఈ పక్రియలో కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని పరిష్కరిస్తూ ఉంటాం. అయితే ఇప్పటి దాకా ఎక్కువమంది నిర్మాతలకు పెద్ద సమస్యలేవీ రాలేదు. ఎవరైనా కొద్ది మందికి సమస్య ఏర్పడితే వాటిని టెక్నాలజీ ఆధారంగా పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌నైనా ఆహ్వానిస్తాం.

దేశంలోనే ఎక్కువగా సినిమాలు తీసే టాలీవుడ్‌కు శాశ్వత రీజనల్‌ అధికారి లేరు. ఈ విషయంపై మీ స్పందన?

ఈ విషయంలో సమాచార ప్రసార శాఖ తగిన చర్యలు తీసుకోవటానికి సిద్ధమయింది. త్వరలో శాశ్వత ఆర్‌ఓను నియమించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే శాశ్వత ఆర్‌ఓ లేకపోవటం వల్ల సినిమా సర్టిఫికెట్స్‌ జాప్యం అవుతాయనటంలో నిజం లేదు. ప్రస్తుతం ఉన్న మా సభ్యుల పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. వారు తమ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఇక త్వరలో పండుగ సీజన్‌ రానుంది. సర్టిఫికెట్ల కోసం సినిమాల రష్‌ పెరుగుతుంది. అన్ని సినిమాలకు సకాలంలో సర్టిఫికెట్లు జారీ చేస్తాం.

మీ మీద తెలుగు సినిమాలు ఎలాంటి ప్రభావం చూపించాయి?

చిన్నప్పుడు దూరదర్శన్‌లో ‘మాయాబజార్‌’ లాంటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలు చూసేవాళ్లం. ఎన్టీఆర్‌, ఏయన్నాఆర్‌ సినిమాలు కూడా దూరదర్శన్‌లోనే చూశాను. ఇక కె. విశ్వనాఽథ్‌గారి సినిమాలు చూడటానికి మా కుటుంబం అంతా థియేటర్లకు వెళ్లేవాళ్లం. ఇలా నా చిన్నతనంలో అనేక అందమైన అనుభూతులున్నాయి.

Updated Date - Nov 22 , 2026 | 10:47 AM