బాలయ్య - కొరటాల మూవీలో.. లక్కీ బ్యూటీ ఫిక్స్! ఎవ‌రంటే?

ABN , Publish Date - Oct 26 , 2026 | 02:46 PM

కొరటాల శివ, బాలయ్య కాంబినేషన్ చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్ లక్కీ చార్మ్ ను దాదాపు ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) జోరు ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఉంది. వరుస బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న బాలయ్య, తన తర్వాతి ప్రాజెక్టులతోనూ అంతకుమించి అంచనాలు పెంచేస్తున్నారు. ఇందులో భాగంగానే బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోన్న విష‌యం అంద‌రికీ విధిత‌మే. ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మాస్ డైలాగులు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో బాలయ్య.. బలమైన సామాజిక అంశాలు, గుండెకు హత్తుకునే డ్రామాతో కొరటాల శివ.. ఈ ఇద్దరూ కలిస్తే వెండితెరపై ఎలాంటి విధ్వంసం ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటివరకు ఎన్నో రూమర్స్, ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా బాలయ్య పక్కన జోడీగా నటించే కథానాయిక ఎవరనే విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపించాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త మీనన్‌ను (Samyuktha) దాదాపు ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. సంయుక్త మీనన్ ఇప్పటికే టాలీవుడ్‌లో నటించిన చిత్రాలతో గోల్డెన్ లెగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పటికే అఖండ 2 లో బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం ఆమెకు ఉంది. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుండటం సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథానుగుణంగా ఎంతో కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో సెన్సేషనల్ విషయం ఏమిటంటే.. ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నారు. ఆయన హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ అన్నీ సరికొత్త పంథాలో డిజైన్ చేస్తున్నారట.


సాధారణంగా కొరటాల సినిమాల్లో కథకు, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన భారీ చిత్రం దేవర ఘనవిజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో, ఈ కథపై ఆయన చాలా కాలం పాటు లోతైన కసరత్తులు చేశారు. కేవలం మాస్ అంశాలకే పరిమితం కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసే బలమైన సెంటిమెంట్, భారీ ఎమోషన్స్‌ను కథలో ప్రధానంగా జోడించారట. బాలయ్య మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పాటు, కొరటాల శైలి లోతైన సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను నవంబర్‌ చివరి వారం నుంచే మొదలుపెట్టేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఒక భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. చిత్రబృందం ప్లాన్ ప్రకారం.. మొదటి షెడ్యూల్‌లో భారీ ఎత్తున కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు. అయితే ఈ తొలి షెడ్యూల్‌లో బాలకృష్ణ లేని సన్నివేశాలతో పాటు ఇతర కీలక నటీనటులపై సీన్లు తీయబోతున్నారట. ఆ తర్వాత షెడ్యూల్ నుంచి బాలయ్య సెట్స్‌పైకి అడుగుపెట్టనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా, రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని

రజనీతో రజనీకే పోటీ.. టాప్‌-3లో ఒకడే కింగ్‌

సూర్యకు ఈ ఏడాది త్రిపుల్‌ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే

Updated Date - Oct 26 , 2026 | 03:14 PM