టాలీవుడ్ గురి ఈ ముగ్గురిపైనే!
ABN, Publish Date - Mar 09 , 2026 | 03:16 PM
టాలీవుడ్ కొత్తభామలను దిగుమతి చేసుకొనే పనిలో పడింది. అందులో కొందరు ఇప్పటికే కొన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. వారిలో ముగ్గురు ముద్దుగుమ్మలను విశేషంగా పరిశీలిస్తున్నారు
టాలీవుడ్ ను ఏలిన భామలు పెళ్లి కాగానే బాలీవుడ్ బాట పట్టడం విశేషం!. అందువల్ల కొత్త భామల వైపు చూస్తోంది టాలీవుడ్. ముఖ్యంగా ముగ్గురు ముద్దుగుమ్మలను తెలుగు సినీజనం లైక్ చేస్తున్నారని టాక్... ఎవరో వారు... !
తృప్తి - మమిత - ఇమాన్వీ...
మొన్నటి దాకా టాలీవుడ్ లో గ్రాండ్ సక్సెస్ చూసిన రశ్మిక మందన్న, సమంత, కీర్తి సురేశ్ - ముగ్గురూ పెళ్ళి కాగానే బాలీవుడ్ వైపు చూస్తున్నారని విశేషంగా వినిపిస్తోంది. ఇక తెలుగమ్మాయి శ్రీలీల ఉందిలే అనుకుంటే ఆమె కూడా ఉత్తరాది వైపే చూపు సారిస్తోందట. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కొత్తభామలను దిగుమతి చేసుకొనే పనిలో పడింది. అందులో కొందరు ఇప్పటికే కొన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. వారిలో ముగ్గురు ముద్దుగుమ్మలను విశేషంగా పరిశీలిస్తున్నారు తెలుగు సినీజనం. వారెవరంటే 'యానిమల్' బ్యూటీ తృప్తి డిమ్రీ. తమిళ స్టార్ సూర్య తెలుగు చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో నటిస్తోన్న మమితా బైజూ... ఇంకొకరు ప్రభాస్ 'ఫౌజీ'లో కనిపించనున్న ఇమాన్వీ ఇస్మాయిల్... తృప్తి డిమ్రీ సైతం ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తీస్తోన్న 'స్పిరిట్'లో నటిస్తోంది.
సూర్యతో బైజూ...
నిజానికి ఇప్పటి దాకా తృప్తి డిమ్రీ, మమితా బైజూ, ఇమాన్వీ ఇస్మాయిల్ నటించిన తెలుగు చిత్రాలేవీ వెలుగు చూడలేదు. అయితే సదరు భామల అందచందాలు మాత్రం సోషల్ మీడియా ద్వారా, వారి ఇతర భాషా చిత్రాల వల్ల తెలుగు రసికులను ఆకర్షిస్తున్నాయి. అందువల్ల ఈ ముగ్గురు భామలపై తెలుగు సినీజనం సైతం మనసు పారేసుకుంటున్నారని తెలుస్తోంది. మళయాళ బ్యూటీ మమితా బైజూ తన మాతృభాష, తమిళ సినిమాల ద్వారానే వెలుగు చూసింది. ఆమె నటించిన 'ప్రేమలు', 'డ్యూడ్' వంటి చిత్రాలు తెలుగులో అనువాద రూపంలో తళుక్కుమన్నాయి. అమ్మడి అందం తెలుగు స్టార్స్ కు సూటయ్యేదే అని టాలీవుడ్ జనం డిసైడ్ అయ్యారు. అలా సూర్యతో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో మమితా బైజూ ఛాన్స్ దక్కించుకుంది.
డాన్స్ తోనే దడదడ...
ఇమాన్వీ ఇస్మాయిల్ ఇప్పటిదాకా ఏ సినిమాతోనూ వెలుగు చూడక పోయినా, ఆమె డాన్స్ చేసిన వీడియోస్ కుర్రకారును చిందులు వేయిస్తున్నాయి. డాన్స్ లో ఇమాన్వీ గ్రేస్ ను చూసి ఫిదా అయిపోయారు సినీజనం... పాకిస్థాన్ రూట్స్ ఉన్న ఇమాన్వీ తాను అమెరికాలో పుట్టాను కాబట్టి 'యూనివర్సల్ గాళ్' ను అంటోంది. ఇప్పటికే పలు హిందీ, తెలుగు, తమిళ హిట్ సాంగ్స్ కు ఇమాన్వీ చేసిన డాన్స్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'ఫౌజీ'లో ఇమాన్వీ నాయికగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజయితే అమ్మడు ఎక్కడికో వెళ్ళిపోతుందనీ భావిస్తున్నారు. మరి తృప్తి డిమ్రీ, మమితా బైజూ, ఇమాన్వీ ఇస్మాయిల్ - ముగ్గురిలో తెలుగువారిని ఎవరు ఎక్కువగా ఆకర్షిస్తారో చూడాలి...