చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేశ్.. నాగార్జున చిత్రాల ఢీ!
ABN, Publish Date - Feb 28 , 2026 | 07:15 PM
ఆలూ లేదు చూలూ లేదు - కొడుకు పేరు సోమలింగం అన్నట్టు సాగుతున్నారు టాలీవుడ్ జనం... సినిమాలు మొదలెట్టలేదు కానీ - సంక్రాంతి బరిపై గురి పెడుతున్నారు...
ఆలూ లేదు చూలూ లేదు - కొడుకు పేరు సోమలింగం అన్నట్టు సాగుతున్నారు టాలీవుడ్ జనం... సినిమాలు మొదలెట్టలేదు కానీ - సంక్రాంతి బరిపై గురి పెడుతున్నారు... స్టార్ హీరోసే కాదు - యంగ్ హీరోస్ సైతం సంక్రాంతి సంబరాల్లో సాగే ప్రయత్నం చేస్తున్నారు.
సీనియర్ స్టార్స్... స్పెషల్...!
సంక్రాంతి సీజన్ స్టార్ హీరోస్ కు అచ్చి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. అందువల్లే సీనియర్ స్టార్స్ తో పాటు టాప్ స్టార్స్, యంగ్ హీరోస్ అందరూ పొంగల్ బరిలో దూకాలనే ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.. చిత్రమేంటంటే - ఇప్పటి దాకా షూటింగ్ మొదలు పెట్టని సినిమాలు సైతం 2027 సంక్రాంతినే టార్గెట్ చేస్తూ రూపొందుతున్నాయని వినికిడి. సీనియర్ స్టార్స్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అందరూ ఈ సారి పొంగల్ హంగామాలో పాలు పంచుకోవాలని ఆశిస్తున్నారు. ఇప్పటి దాకా సీనియర్ స్టార్స్ నలుగురూ ఒకేసారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నది లేదు. చిరంజీవి-బాబీ సినిమా, బాలకృష్ణ తదుపరి చిత్రం, నాగార్జున 'వాసి వాడి తస్సాదియ్యా', వెంకటేశ్ - కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమా అన్నీ కూడా పొంగల్ హంగామాలోనే సాగనున్నాయి.
అదే బాటలో వాళ్ళూ...
సీనియర్ స్టార్స్ సంగతి అలా ఉంచితే, యంగ్ హీరోస్ లో నితిన్, శర్వానంద్, వరుణ్ తేజ్ కూడా సంక్రాంతి సంబరాలపైనే ఆశలు పెట్టుకున్నారని టాక్. నితిన్ హీరోగా అజయ్ దర్శకత్వంలో రూపొందే చిత్రం, వరుణ్ తేజ్ కథానాయకునిగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా కూడా పొంగల్ పైనే గురి పెట్టాయి. ఇక సంక్రాంతి తనకు అచ్చివస్తుందని ఆశించే శర్వానంద్ తో శ్రీను వైట్ల రూపొందించబోయే సినిమా కూడా రాబోయే పొంగల్ లోనే సందడి చేయాలని ఉందట. ఈ సినిమాలేవీ మొదలు కాకుండానే సంక్రాంతిపై మనసు పారేసుకోవడం వింతగా ఉందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.
టైటిల్స్ లోనూ పొంగల్ టచ్...
అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' అన్న టైటిల్ పెట్టి మరీ పొంగల్ హిట్టు పట్టేశారు. ఆ సెంటిమెంట్ తోనే అనిల్ రాబోయే సినిమాకూ 'పొంగల్' టచ్ ఇస్తారని టాక్. అదలా ఉంచితే నాగార్జున సినిమాకు టైటిల్ మార్చి 'సంక్రాంతి సోగ్గాళ్ళు'గా వస్తుందని అంటున్నారు. నితిన్ సినిమాకు 'సంక్రాంతి శుభాకాంక్షలు' అన్న టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్. ఇక వరుణ్ తేజ్ తో మారుతి తీసే సినిమాకు 'హ్యాపీ పొంగల్' టైటిల్ ఉంటుందట! రాజేశ్ దండా అనే నిర్మాత తన సినిమా ఆరంభించకుండానే 'అదిరిపోద్ది సంక్రాంతి' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. ఇలా సినిమా పేర్లలోనే 'సంక్రాంతి' టచ్ ఇస్తున్నారు కొందరు. అందరికీ అనిల్ రావిపూడిలా అచ్చి వస్తుందని గ్యారంటీ లేదు. అయినా కొందరు హిట్స్ సాధిస్తున్నారు కాబట్టి తామూ అదే బాటలో పయనించాలని ఉవ్విళ్ళూరు తున్నారు టాలీవుడ్ జనం. మరి ఇక్కడ పేర్కొన్న ప్రాజెక్ట్స్ లో ఎన్ని సినిమాలు 2027 పొంగల్ రేసులో పాల్గొంటాయో చూడాలి.