సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆగస్ట్‌లో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ రిపోర్ట్‌

ABN, Publish Date - Aug 31 , 2026 | 04:01 PM

Tollywood August Report Hits, Surprises and a Major Disappointment

ఆగస్ట్‌ నెల టాలీవుడ్‌ బాక్సాఫీస్‌కి కాస్త ఊపిరి పోసిన నెలగా నిలిచింది. వరుసగా వచ్చిన సినిమాల్లో కొన్ని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే కాకుండా మంచి వసూళ్లు సాధించాయి. మరికొన్ని భారీ అంచనాలతో వచ్చి పూర్తిగా నిరాశపరిచాయి. ముఖ్యంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయగా.. ఒక భారీ చిత్రం మాత్రం అంచనాల భారాన్ని మోయలేకపోయింది. మొత్తంగా చూస్తే ఆగస్ట్‌ నెల టాలీవుడ్‌కి మిశ్రమ ఫలితాలతో పాటు కొత్త ఉత్సాహాన్ని కూడా అందించింది.

‘కొరియన్ కనకరాజు’తో జోష్‌

ఆగస్ట్‌ తొలి వారంలో వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్‌కి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న వరుణ్‌ తేజ్‌కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చింది. కథలో కామెడీని చక్కగా మిక్స్‌ చేయడం సినిమాకు ప్లస్‌గా మారింది. ముఖ్యంగా సత్యతో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించాయి. 

లోకేష్‌ ‘డీసీ’.. ఊహించని సక్సెస్‌! (DC Movie)

ఆగస్ట్‌లో ప్రేక్షకులకు అసలు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సినిమా లోకేష్‌ కనకరాజు నటించిన ‘డీసీ’. దర్శకుడిగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను సొంతం చేసుకున్న లోకేష్‌.. నటుడిగా తొలిసారి తెరపైకి వచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇంటెన్స్‌ కథ, టేకింగ్‌, మేకింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా కథను నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసిన ఏషియన్‌ గ్రూప్‌కు కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపిన చిత్రంగా ‘డీసీ’ ఆగస్ట్‌ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. చక్కని ఆదరణ (Vishwanath & Sons)

ఆగస్టు 15 సందర్భంగా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మరో మంచి విజయాన్ని అందుకుంది. సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను  ఆకట్టుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరికి  హ్యాట్రిక్‌ అందించిన చిత్రంగా ఇది నిలిచింది. పూర్తిగా తమిళంలో రూపొందినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఎమోషన్‌ బాగా కనెక్ట్‌ అయింది. ముఖ్యంగా మదర్‌ సెంటిమెంట్‌, కుటుంబ బంధాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాకు బలంగా మారాయి.  త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే పబ్లిక్ రెస్పాన్స్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.మమితా బైజు ప్రెజెన్స్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఖాతాలో మరో పడింది.హిట్ పడింది. 

ఇరుముడి’.. బాక్సాఫీస్‌ కింగ్‌!(Irumudi)

ఆగస్ట్‌ మూడోవారం వచ్చిన రవితేజ ‘ఇరుముడి’ మాత్రం బాక్సాఫీస్‌ లెక్కలను మార్చేసింది. ఈ సినిమా సాధించిన విజయాన్ని సాధారణ హిట్‌గా చూడలేం. ప్రేక్షకులు సినిమాను ఓన్‌ చేసుకున్నారు. కథలోని ఎమోషన్‌, భక్తి, యాక్షన్‌ అంశాలు కలిసి సినిమాకు బలమైన కనెక్ట్‌ను తీసుకొచ్చాయి.అయ్యప్ప స్వామి చుట్టూ ఉన్న భక్తి అంశాలు, పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా రవితేజ తన ఇమేజ్‌కి భిన్నంగా కథను నమ్ముకుని చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చింది. చాలా కాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ పెద్ద రిలీఫ్‌ ఇచ్చింది. విడుదలై రెండు వారాలు కావొస్తున్నా  కొన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపించడం సినిమా ఏ రేంజ్ హిట్టు అయిందో తెలుస్తుంది.  

‘టాక్సిక్‌’ హైప్‌.. ఫలితం  శూన్యం.. (Toxic)

యష్‌ ‘టాక్సిక్‌’ మాత్రం ఆగస్ట్‌లో అతిపెద్ద నిరాశగా నిలిచింది. టీజర్‌, ట్రైలర్‌ నుంచే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్టైలిష్‌ మేకింగ్‌, భారీ బడ్జెట్‌, యష్‌ క్రేజ్‌తో సినిమా దేశవ్యాప్తంగా హైప్‌ తెచ్చుకుంది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కథ, కథనం, పాత్రల రూపకల్పన ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో సినిమా బలహీనపడింది. ఎంత భారీగా తెరకెక్కించినా.. కంటెంట్‌ కనెక్ట్‌ కాకపోతే బాక్సాఫీస్‌ వద్ద నిలబడటం కష్టమని ‘టాక్సిక్‌’ మరోసారి చూపించింది.

చిన్న సినిమాల పరిస్థితి నిరాశే!

ఆగస్ట్‌లో వచ్చిన చిన్న సినిమాలకు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ‘కేజేక్యు’, ‘ఎంఎస్‌ రాజు ఆగధ’, ‘హుషారు పిట్టలు’, ‘అమీర్‌ లోగ్‌’, విశాల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మకుటం’ వంటి చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి. చివరి వారంలో వచ్చిన నయనతార ‘హాయ్‌’ సినిమా పరిస్థితి కూడా అంతే. సినిమాపై ముందుగా సరైన బజ్‌ లేకపోవడం, థియేటర్లలో కంటెంట్‌ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఫైనల్ గా చూస్తే.. భారీ బడ్జెట్‌, స్టార్‌ క్రేజ్‌ కంటే కంటెంట్‌, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు ఓటేశారు. ‘కొరియన్ కనకరాజు’ మంచి ఓపెనింగ్‌ ఇచ్చింది. ‘డీసీ’ అంచనాలను మించి సర్‌ప్రైజ్‌ చేసింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించింది. ఇక ‘ఇరుముడి’ మాత్రం ఆగస్ట్‌ బాక్సాఫీస్‌కు అసలైన జోష్‌ తీసుకొచ్చింది. అదే సమయంలో ‘టాక్సిక్‌’లాంటి భారీ చిత్రం కంటెంట్‌ విషయంలో తడబడితే ఎంతటి హైప్‌ ఉన్నా ప్రేక్షకులు ఆదరించరని నిరూపించింది. 

Updated Date - Aug 31 , 2026 | 04:38 PM