నేడు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక.. సర్వం సిద్ధం! కార్యక్రమాల వివరాలు
ABN, Publish Date - Mar 19 , 2026 | 09:55 AM
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ రెండో ఎడిషన్ 2025 ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA) (Telangana Gaddar Film Awards) రెండో ఎడిషన్ 2025 ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ రోజు (గురువారం, మార్చి 19)న హైదరాబాద్ HITEX కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఉలగనాయగన్ కమల్ హాసన్, కింగ్ నాగార్జున, అక్కినేని అఖిల్, నాగ చైతన్య, రష్మిక మందన్న, ఖుష్బూ సుందర్, సజా అలీ, మాధురి దీక్షిత్ నేనే, శోభిత ధూళిపాళ, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్కమార్క ముఖ్య అతిథులుగా విచ్చేసి అవార్డు గ్రహీతలకు పుసప్కారాలు అందజేసి సన్మానించనున్నారు.
ఇదిలాఉంటే.. ఈ అవార్డుల వేడుకకు సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయనున్నారు. నిధి అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్ల ప్రత్యేక ప్రదర్శణలు, శ్రేయా ఘోషల్, దేవి శ్రీ ప్రసాద్ (DSP), మంగ్లీ లైవ్ ప్రదర్శనలతో సందడి చేయనున్నారు. ఇవేకాకుండా తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా వనజ ఉదయ్ డాన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు హైలెట్ కానున్నాయి. నిఖిల్ విజయేంద్ర, డౌలత్ సుల్తానా కలిసి అతిథులను ఆహ్వానించనున్నారు.