కుమారస్వామి కథ.. ముగ్గురు దర్శకులు పోటీ?
ABN, Publish Date - Apr 05 , 2026 | 10:26 AM
భారతీయ పురాణాల్లో అత్యంత పరాక్రమవంతుడు, దేవసేనాధిపతి, యుద్ధానికి అధిపతి.. కుమారస్వామి.
భారతీయ పురాణాల్లో అత్యంత పరాక్రమవంతుడు, దేవసేనాధిపతి, యుద్ధానికి అధిపతి.. కుమారస్వామి (Kumaraswamy). తమిళనాట మురుగన్ గా నీరాజనాలు అందుకునే ఈ దైవంపై కథ వెండితెరపైకి వస్తే ఎలా ఉంటుంది.. ఇప్పటివరకు కుమారస్వామి కథతో మన తెలుగు వెండితెరపై ఒక భారీ విజువల్ వండర్ రాలేదు. కానీ, ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన వార్ మొదలైంది. ఒకే దేవుడి కథపై ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ వర్క్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. ముందుగా టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన గత కొంతకాలంగా కుమారస్వామి కథపై విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న త్రివిక్రమ్, దీనికి గాడ్ ఆఫ్ వార్ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది.
ఈ కథను ముందుగా అల్లు అర్జున్ (allu arjun) విన్నారు.. ఓకే చెప్పారు. ఆ తర్వాత అది ఎన్టీఆర్ (ntr) చేతుల్లోకి వెళ్ళిందని ప్రచారం జరిగింది. తాజాగా మళ్ళీ బన్నీ వద్దకే ఈ స్క్రిప్ట్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్లారిటీ రాక ముందే ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. లోతైన పురాణ పరిశోధనతో త్రివిక్రమ్ (trivikram) రాసుకున్న ఈ స్క్రిప్ట్, ఈ ఇద్దరు స్టార్ హీరోలలో ఎవరి దగ్గర సెట్ అవుతుందనేది టాలీవుడ్‌లో పెద్ద సస్పెన్స్ గా మారింది.
త్రివిక్రమ్ డైలమాలో ఉండగానే, టాలీవుడ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) లైన్‌లోకి వచ్చారు. హనుమాన్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం జై హనుమాన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే, ఆయన తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ PVCU లో భాగంగా కుమారస్వామి కథను కూడా తెరకెక్కించబోతున్నారని గట్టిగా వినిపిస్తోంది. దీనికి మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే.. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించకుండా కథ అందించడంతో పాటు, ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను తీసుకోనున్నాడట. కేవలం దర్శకత్వమే కాకుండా, నిర్మాతగా కూడా మారి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇప్పటికే మహాకాళి ప్రాజెక్ట్‌ను కొత్త దర్శకుడితో చేస్తున్న ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ఈ కుమారస్వామి ప్రాజెక్ట్‌ను కూడా తన పర్యవేక్షణలోనే నిర్మించబోతున్నారట. హనుమాన్ విజయం తర్వాత ఇలాంటి దైవిక నేపథ్యం ఉన్న కథలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇండస్ట్రీకి కలిసొచ్చే అంశమే. ప్రశాంత్ వర్మ విజన్, గ్రాఫిక్స్‌పై ఆయనకున్న పట్టు ఈ ప్రాజెక్ట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఇక వీరిద్దరితో పాటు వీరిద్దరితో పాటు ఈ రేసులో మరో దర్శకుడు కిషోర్ తిరుమల (kishore tirumala) కూడా ఉన్నారు. సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసే కిషోర్ తిరుమల, ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆయన ఇప్పుడు తన రూట్ మార్చి కుమారస్వామి కథపై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ఎవరి వెర్షన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక.. లోకానికి తెలిసిన విషయమే ఏంటంటే.. తమిళనాడులో మురుగన్‌గా కొలిచే కుమారస్వామికి అక్కడ విపరీతమైన భక్తి భావం ఉంది. కానీ తెలుగులో ఇప్పటి వరకు ఆయన పరాక్రమంపై పూర్తి స్థాయి భారీ చిత్రం రాలేదు. అటు యాక్షన్, ఇటు ఎమోషన్, అలాగే ఆధ్యాత్మికత.. ఈ మూడు అంశాలు కలగలిసిన కథ కావడంతో దర్శకులందరి కన్ను ఈ ప్రాజెక్ట్ పై పడింది. ఒకే ఇతివృత్తాన్ని ముగ్గురు వేర్వేరు కోణాల్లో ఆవిష్కరించడం ఇండస్ట్రీలో ముందెన్నడూ చూడని అరుదైన దృశ్యం.