నా మాటలు.. వక్రీకరించారు! వాళ్ల ఏడుపు, కష్టం.. నాకు అర్థమవుతోంది

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:07 PM

రామాయణంపై తన మాటలను వక్రీకరించారని, తాను ఏ మతానికీ వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు ప్రకాశ్ రాజ్.

Prakash Raj

రామాయణంపై తన మాటలను వక్రీకరించారని, తాను ఏ మతానికీ వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు ప్రకాశ్ రాజ్ (Prakash Raj). ఆయన ఇటీవల రామాయణంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఓ సాహిత్య కార్యక్రమంలో నేను చేసిన ప్రసంగంలో నేను పాల్గొన్న కార్య‌క్ర‌మ నేప‌థ్యం, మాట్లాడింది పూర్తిగా విన‌కుండా, తెల‌సుకోకుండానే అందులోని కొన్ని మాటలను మాత్రమే తీసుకొని వాటిని త‌మ‌కు అనుకూలంగా వక్రీకరించారన్నారు.

నేను శ్రీరాముడిని ఎగతాళి చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేశానని అంటున్నారు. అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్లు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక, నన్ను హిందూ ధర్మ విరోధి అని నిందించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ల ఏడుపు, వాళ్ల కష్టం నాకు అర్థమవుతోంది. కాబట్టి వాళ్లకు నేను సమాధానం చెప్పాలి. ఇప్పుడే కేర‌ళ‌ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను తోట పనిలో బిజీగా ఉన్నా. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా? లేక ఇలాగే వాగుతుంటారా? అది మీ ఇష్టం' అని ప్రకాశ్ రాజ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

ప్రకాశ్ రాజ్ పై ఫిర్యాదు

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం బీజేపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీరామచంద్రుడు ఉత్తర భారతీయుడని, రావణ రాజ్యంలో రామ, లక్ష్మణ, సీతమ్మలు పండ్లు దొంగతనం చేయడం వల్లే రామ రావణ యుద్ధం జరిగిందంటూ అనుచిత, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే చట్టపరమైన విచారణ చేపట్టి ప్రకాశ్ రాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మారావు, రామ్మోహన్, ఆవుల సుబ్బా రావు, కుంజా సంతోష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 02:19 PM