Ram Charan: చరణ్ కన్నా ముందు కవలలకు జన్మనిచ్చిన స్టార్స్ వీరే..
ABN, Publish Date - Feb 02 , 2026 | 06:00 PM
ఆనందమానందమాయె అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో ఈ యేడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు (Mana ShankaraVaraPrasad Garu)'తో బిగ్ హిట్ అందుకున్న సందర్భంగా క్లౌడ్ నైన్ లో తేలిపోతున్నారు ఫ్యాన్స్.
Ram Charan: ఆనందమానందమాయె అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో ఈ యేడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు (Mana ShankaraVaraPrasad Garu)'తో బిగ్ హిట్ అందుకున్న సందర్భంగా క్లౌడ్ నైన్ లో తేలిపోతున్నారు ఫ్యాన్స్. ఇక తమ హీరో నటవారసుడు రామ్ చరణ్ (Ram Charan) కు జనవరి 31వ తేదీన కవలలు జన్మించడం, అందులో తమ హీరో కోరుకున్నట్టుగానే ఓ మగపిల్లవాడు ఉండడం అభిమానులకు మరింత ఆనందం కలిగిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బంపర్ హిట్ కొట్టడం, ఆయనకు మనవడు, మనవరాలు జన్మించడం రెండూ జనవరిలోనే చోటు చేసుకోవడంతో 2026 జనవరి మాసాన్ని ఎప్పటికీ మరచిపోలేం అంటున్నారు ఫ్యాన్స్. చెర్రీ, ఉపాసనకు ఇంతకు ముందో పాప ఉంది. సో- ఆమెకు ఓ తమ్ముడు, ఓ చెల్లి లభించారన్న మాట. దీంతో ఇంతకుముందు స్టార్స్ లో ఎవరెవరు ట్విన్స్ కు జన్మనిచ్చారో గుర్తు చేసుకుంటున్నారు సినీ ఫ్యాన్స్.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు, ఆయన భార్య వెరోనికాకు కూడా మొదట్లో ట్విన్స్ జన్మించారు. వారి పేర్లు అరియానా, వివియానా - 2011లో వీరు జన్మించారు. తరువాత మంచు దంపతులకు 2018లో ఓ అబ్బాయి, 2019లో ఓ అమ్మాయి జన్మించారు. నటదర్శకుడు రాహుల్ రవీంద్రన్, గాయని చిన్మయి దంపతులకు కూడా కవలలు పుట్టారు... వారి పేర్లు ద్రిప్తా, శర్వాస్. ఇక అభినేత్రి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ దంపతులకు కూడా కవల పిల్లలు ఉన్నారు. అయితే ఈ దంపతులు సరోగసీ ద్వారా కవలలను సంపాదించడం విశేషం. ఇక మన తెలుగు యాంకర్ ఉదయభాను కూడా మొదటి కాన్పులోనే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు పిల్లలు అరియానా, వివియానా తెరపై కూడా కనిపించారు. వారిద్దరూ తండ్రి హీరోగా రూపొందిన 'కన్నప్ప'లో ఓ పాటలో నర్తించడమూ విశేషం.
ఇక దక్షిణాదినే కాదు ఉత్తరాదిన సైతం పలువురు స్టార్స్ కు కవలల పిల్లలు జన్మించారు... వారిలో అందరికంటే ముందుగా గుర్తుకు వచ్చేది శత్రుఘ్న సిన్హా- పూనమ్ సిన్హా దంపతులకు లవ్-కుశ్ అనే కవలలు ఉన్నారు. అందాలతార సోనాక్షి సిన్హాకు ఈ ఇద్దరూ సొంత అన్నలు. సంజయ్ దత్, మాన్యతా కపుల్ కు షహ్రాన్, ఇక్రా అనే ట్విన్స్ జన్మించారు. సన్నీ లియోన్- డానియెల్ వెబర్ కు కవల మగపిల్లలు పుట్టారు. ప్రీతి జింటా సరోగసీ ద్వారా 2021లో ట్విన్స్ ను పొందింది... వారి పేర్లు జై, జియా.
బాలీవుడ్ నోటెడ్ ఫిలిమ్ మేకర్ కరణ్ జోహార్ పెళ్ళి చేసుకోక పోయినా, 2017లో సరోగసీ ద్వారా యశ్, రూహి అనే కవలలకు తండ్రి అయ్యారు. బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ కూడా 2012లో కవలల పిల్లలకు జన్మనిచ్చారు. ఇలా పలువురు మూవీ సెలబ్రిటీస్ ట్విన్స్ కు జన్మనిచ్చారు. ఇప్పుడు చెర్రీ, ఉపాసన కూడా ఈ జాబితాలో చేరారు. మరి తమ మొదటి సంతానానికి 'క్లీంకార' అని నామకరణం చేసిన చరణ్, ఉపాసన ఈ కవలలకు ఏ పేర్లు పెడతారో అన్న ఆసక్తి కూడా ఫ్యాన్స్ లో నెలకొనడం విశేషం. ఏది ఏమైనా తాత చిరంజీవికి, తండ్రి రామ్ చరణ్ కు ఈ కవలల కారణంగా అమితానందం సొంతమయింది..