దేశమంతా తెలుగు సినిమాలంటే క్రేజ్.. తమిళులు మాత్రం ఎందుకు చూడరు?
ABN, Publish Date - Oct 18 , 2026 | 04:23 PM
పరభాషా తారలను ఆదరించడంలో తెలుగువారు ముందుంటారు. కానీ, మన స్టార్స్ ను ఎందుకనో సౌత్ లోని ఇతర భాషల వారు అంతగా ఆదరించడం లేదు. ఆ ముచ్చటేంటో ముందుగా చూద్దాం.
మన తారలను ఇతరులు ఎందుకని ఆదరించరు?
తెలుగు సినిమా (Telugu Cinema) వెలుగులు నేడు దశదిశలా ప్రసరిస్తున్నాయి. అయితే మన టాలీవుడ్ స్టార్స్ ను సౌత్‌లోని పరభాషల వారు ఎందుకనో అంతగా ఆదరించడం లేదు. ముఖ్యంగా తమిళ జనం (Tamil Audience) తెలుగు స్టార్స్ మూవీస్‌ను తమ నేలపై సక్సెస్ రూటులో నడిపించడానికి అంతగా ఇష్టపడడం లేదు. ఎందుకలాగా?
సౌత్ లేకున్నా.. నార్త్ ఉంది
ప్రాంతీయ భాషల నుంచి వెయ్యి కోట్ల క్లబ్లో చోటు సంపాదించిన అధిక చిత్రాలు తెలుగు వారివే కావడం విశేషం. 'బాహుబలి- ద కంక్లూజన్', 'ట్రిపుల్ ఆర్', 'పుష్ప-ద రూల్','కల్కి 2898 ఏడి' చిత్రాలు వెయ్యి కోట్ల క్లబ్లో చోటు సంపాదించాయి. ఆ మాటకొస్తే మన దేశంలో వెయ్యికోట్ల క్లబ్‌కు శ్రీకారం చుట్టిందే మన బాహుబలి-ద కంక్లూజన్ (Baahubali 2) కావడం గమనార్హం. దక్షిణాదిన తెలుగు చిత్రాలను కర్ణాటక (Karnataka) లోనే బాగా ఆదరిస్తారు. కేరళ (Kerala) లో అల్లు అర్జున్, జూనియర్ యన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) లాంటి వారి సినిమాలనే పట్టించుకుంటారు.
ఇక తమిళనాడులో మన టాప్ స్టార్స్ మూవీస్‌ను చూడటానికి పెద్దగా ఇష్టపడడం లేదు. అయినా మన తెలుగు సినిమాలు రికార్డ్ స్థాయి వసూళ్ళు పోగేస్తున్నాయి. ఇదెలా సాధ్యం? ఉత్తరాదిన మన తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అది రాజమౌళి 'బాహుబలి- ద బిగినింగ్'తో మొదలయింది. ఆ తరువాత నుంచీ తెలుగు వారి హిందీ అనువాదాలను చూడటానికి ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్లే తమిళ తంబీలు మన సినిమాలను అసలు పట్టించుకోకపోయినా, నాలుగు చిత్రాలు వెయ్యి కోట్ల క్లబ్లో చోటు సంపాదించాయి.
జగమెరిగిన సత్యం..
తమిళ స్టార్ హీరోస్ అయిన ఆ నాటి శివాజీగణేశన్, ఎమ్జీ రామచంద్రన్, తరువాతి తరం కమల్ హాసన్, రజనీకాంత్, విక్రమ్, సూర్య, కార్తి, విజయ్, ధనుష్ - ఇలా పలువురు తమిళ స్టార్ హీరోస్ మూవీస్‌ను తెలుగు వారు విశేషంగా ఆదరిస్తూ ఉంటారు. కానీ, తమిళులు మాత్రం మన తెలుగు వారి సినిమాలు తమిళంలో అనువాదమై వచ్చినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయం తెలిసే రాజమౌళి తన 'బాహుబలి-2' చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కించినట్టు ప్రకటించుకోవలసి వచ్చింది. అయినా, ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఎందువల్లో తమిళ జనం తెలుగు వారి చిత్రాలను అంతగా ఆదరించరు అన్నది జగమెరిగిన సత్యం.
రాజకీయ కోణం..
శివాజీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్, విక్రమ్ వంటి తమిళ స్టార్స్ నేరుగా తెలుగు చిత్రాలలోనూ నటించి అలరించిన సందర్భాలున్నాయి. మన యన్టీఆర్, ఏయన్నార్ కూడా నేరుగా తమిళ సినిమాల్లో అభినయించి అలరించారు. తెలుగు చిత్రాలు ఒకప్పుడు తమిళనాట విశేషాదరణ పొందాయి. 1953లో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచీ తమిళులకు మన తెలుగువారంటే గిట్టదు. ఏది చేసినా తొలి అడుగు తమదే అయి ఉండాలన్నది తమిళుల భావన.
అయితే మన దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్టం ఏర్పడింది. అప్పటి దాకా మద్రాసు నగరంలో తమిళ, తెలుగు భేదం లేకుండా ఎంతో సఖ్యంగా ఉండేవారు. కానీ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి మనవాళ్ళు వేరుపడగానే తమిళులు తమ రాష్ట్రంలో తెలుగు చిత్రాలను ఆదరించడం పూర్తిగా తగ్గించేశారు. అంతకు ముందు తెలుగు సినిమాలు నేరుగా తమిళనాడులో విజయభేరీ మోగించిన సందర్భాలున్నాయి. తరువాత ఎన్నో ఏళ్ళకు 'ప్రేమాభిషేకం' మద్రాసులో సక్సెస్ సాధించింది. ఆ పై మన యంగ్ హీరోస్ కొన్ని సినిమాలు చెన్నైలోనూ ఆదరణ పొందాయి.
కన్నడనాట కదం తొక్కిన వైనం..
కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు, బళ్ళారి, చింతామణి, గౌరీబిద్దనూరు, హుబ్లీ వంటి కేంద్రాలు మొదటి నుంచీ మన తెలుగు స్టార్ మూవీస్ ను విశేషంగా ఆదరించాయి. ఆ పంథా ఈ నాటికీ కొనసాగుతూనే ఉండడం విశేషం. తెలుగు, కన్నడ భాషలకు చాలా దగ్గర పోలిక ఉంటుంది. అలాగే తెలుగు, కన్నడ సీమల వారి మధ్య బాంధవ్యాలు నెలకొన్నాయి. వాస్తవానికి తెలుగు నేలపై ఏదో ఒకటి అర ప్రాంతాల్లో తప్ప కన్నడ చిత్రాలను తెలుగు వారు అంతగా ఆదరించరు. అయినా కన్నడిగులు తమ భాషపై ఎంత మమకారం ఉన్నప్పటికీ ఆ నాటి యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు మొదలు ఈ నాటి టాప్ స్టార్స్ (Telugu Star Heroes) వరకు మన తెలుగు సినిమాలను నేరుగానే ఆదరిస్తూ ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో కన్నా మిన్నగా కొన్ని తెలుగు చిత్రాలు కన్నడసీమలో జైత్రయాత్ర చేసిన సందర్భాలూ లేకపోలేదు.
తమిళులను ఆకర్షించడానికి..
ఒకవేళ మన తెలుగు స్టార్స్ నేరుగా తమిళ చిత్రాలలో నటించినా, సదరు సినిమాలను పెద్దగా ఆదరించిన సందర్భాలు లేవు. అయితే నాగార్జున 'గీతాంజలి', బాలకృష్ణ 'రౌడీ ఇన్ స్పెక్టర్', రాజశేఖర్ 'అంకుశం' వంటి చిత్రాలను అనువాద రూపంలోనూ తమిళులు ఆదరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నాగార్జున నేరుగా 'రచ్చగన్' అనే తమిళ చిత్రంలో నటిస్తే, ఆ సినిమా పరాజయం పాలయింది. ఈ నాటి టాలీవుడ్ స్టార్స్ ఎవ్వరూ నేరుగా తమిళ చిత్రాలలో నటించక పోవడం గమనార్హం. జూ.యన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి వారు స్ట్రెయిట్ తమిళ మూవీస్‌లో నటిస్తామని కొన్ని సందర్భాల్లో తెలిపారు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో అట్లీ తెరకెక్కిస్తున్న 'రాకా' సినిమా స్ట్రెయిట్ తమిళ సినిమానే అంటున్నారు.
ఆ నలుగురే..
కేరళలో అల్లు అర్జున్, జూనియర్ యన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి వారి సినిమాలను విశేషంగా ఆదరిస్తున్నారు. అది అభినందనీయమే. ఈ నలుగురు యంగ్ హీరోస్ చిత్రాల్లోని భారీతనమే కేరళ వాసులను ఆకర్షిస్తోందని అక్కడి సినీ పండిట్స్ చెబుతున్నారు. ఆ తీరున సాగాలని ఇతర టాలీవుడ్ స్టార్స్ సైతం ప్రయత్నిస్తున్నారు. కానీ, ఎవ్వరూ ఈ నలుగురి స్థాయిలో కేరళ నాట సక్సెస్ సాధించక పోవడం గమనార్హం.
క్రాస్-కల్చరల్ మూవీస్..
ఇతర భాషల వారిని సైతం ఆకర్షించాలంటే ఏం చేయాలి?. మన సినిమాల్లో వారి భాషలకు కూడా గౌరవమిస్తూ సాగడమే సబబు అని కొందరు పరిశీలకులు సూచిస్తున్నారు. మన టాప్ స్టార్స్ మూవీస్‌లో తెలుగు పాటలే కాకుండా సందర్భోచితంగా ఆయా భాషలకు చెందిన పాటలను చొప్పిస్తే బాగుంటుందనీ చెబుతున్నారు. తమిళులు తమ తొలి చిత్రంగా చెప్పుకొనే 'కాళిదాస' సినిమాను తెరకెక్కించింది తెలుగు వారైన హెచ్.ఎమ్.రెడ్డి. అందులో తమిళ- తెలుగు రెండు భాషలూ వినిపిస్తాయి. అదో మిశ్రమ భాషా చిత్రం.
ఇప్పుడు కూడా తమిళ తంబీలను ఆకట్టుకోవాలంటే అలాంటి మిశ్రమ భాషా సినిమాలు అవసరమని సినీ పండితులు సూచిస్తున్నారు. అంటే తమిళనాడులో సాగే తెలుగు వారి కథలైనా రావాలి లేదా తెలుగునాట ఉండే తమిళ, కన్నడ, మళయాళీల నేపథ్యంలో సినిమాలైన రూపొందాలి. అలా కాకుండా ఏదో వినోదం కోసం వారి భాషలను వినియోగించుకుంటే అప్పుడు మరింతగా వారి ద్వేషాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయాలను గుర్తుంచుకొని మరీ సినిమాలను రూపొందించాల్సి ఉంటుంది. మరి ఈ బాటలో పయనిస్తూ 'క్రాస్-కల్చరల్' మూవీస్ ఎందరు రూపొందిస్తారో చూడాలి.