చిరు- పవన్ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో
ABN, Publish Date - Mar 01 , 2026 | 12:39 PM
టాలీవుడ్ ఇండస్ట్రీ.. ఎప్పటి నుంచో కొన్ని కాంబోలను తెరపై చూడాలని ఆరాటపడుతుంది. అందులో మెగా బ్రదర్స్ కాంబినేషన్ ఒకటి.
టాలీవుడ్ ఇండస్ట్రీ.. ఎప్పటి నుంచో కొన్ని కాంబోలను తెరపై చూడాలని ఆరాటపడుతోంది. అందులో మెగా బ్రదర్స్ కాంబినేషన్ ఒకటి. 'మనం' సినిమా వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ కూడా అలాంటి ఒక సినిమా చేస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా రావాలని మెగా ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. ఆ ఆశ నెరవేరడం కష్టమే కానీ అసాధ్యం అయితే కాదు. తాజాగా మెగా బ్రదర్స్ మల్టీస్టారర్ కి రంగం సిద్ధమవుతోందని ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. ఇటీవలే ఒక దర్శకుడు వీరిద్దరికి ఒక కథను వినిపించాడని, అది మెగా బ్రదర్స్ ఇద్దరికీ నచ్చిందని టాక్. ఒక హీరో ఎక్కువ.. ఒక హీరో తక్కువ అని కాకుండా ఇద్దరి పాత్ర సరిసమానంగా ఉండబోతోందట. యాక్షన్, ఎమోషన్స్, సెంటిమెంట్ అన్ని ఈ కథలో ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా ఫ్యాన్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేసి మరీ వినిపించాడట డైరెక్టర్. స్క్రిప్ట్ నచ్చినా చిరు- పవన్ స్క్రిప్ట్ ని ఓకే చేయడానికి కొంత సమయం అడిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కథ పట్టాలెక్కబోతుందని టాక్.
ఇక చిరు - పవన్ మల్టీస్టారర్ అనే వార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారు. ఈ వార్తలో నిజముందో లేదో అనేది ఆలోచించకుండా ఎలాగైనా ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నామని,ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని, బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్.. చిరంజీవి నటించిన సినిమాల్లో గెస్ట్ గానే కనిపించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ఒక సాంగ్ లో, శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో ఒక ఫైట్ సీన్ లో పవన్ మెరిశారు. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ ఓకే అయితే కనుక అన్నదమ్ములిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే అవుతుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.