తెలుగులోనూ.. థియేటర్లకు 'ది కేరళ స్టోరీ 2'! ఇక్కడైనా.. చూస్తారా?
ABN, Publish Date - Mar 05 , 2026 | 01:49 PM
గత శుక్రవారం విడుదలైన 'ది కేరళ స్టోరీ 2' సినిమా ఇప్పుడు తెలుగులోనూ విడుదల కాబోతోంది. కోర్ట్ కేసులను అధిగమించి జనం ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి.
కోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ లభించడంతో గత శుక్రవారం రాత్రి నుండి హిందీ సినిమా 'ది కేరళ స్టోరీ 2' (The Kerala Story 2) ప్రదర్శన మొదలైంది. తొలుత ఈ సినిమాను హిందీతో పాటు నాలుగు ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే... సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు నుండీ రకరకాల ఫిర్యాదులతో మేకర్స్ కోర్టుల చుట్టూనే తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా ఎల్లుండి రిలీజ్ అనగా కేరళ హైకోర్ట్‌లో సింగిల్ జడ్జి ఈ సినిమా విడుదలను రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మేకర్స్ ద్విసభ్య ధర్మాసనంకు వెళ్ళడంతో సినిమా విడుదలకు వారు పచ్చ జెండా ఊపారు. ఆ రకంగా గత శుక్రవారం రాత్రి నుండి షోస్ పడటం మొదలైంది.
సాధారణ ప్రేక్షకుల నుంచి 'ది కేరళ స్టోరీ 2'కు మిశ్రమ స్పందనే లభిస్తోంది. అయితే ఈ సినిమాకు రాజకీయ రంగు పులుము కోవడంతో హిందుత్వ వాదులు, భారతీయ జనతా పార్టీ నేతలు ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఇటీవల బీజేపీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ (Dr. Lahman), ఎం. రఘునందనరావు తదితరులు కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న లవ్ జీహాద్ సంఘటనలను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారని వారన్నారు. ఈ సినిమా విడుదల తర్వాత కూడా కేరళలో పలు చోట్ల దీనిపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే... తాజాగా ఈ శుక్రవారం నుండి 'ది కేరళ స్టోరీ 2' మూవీ తెలుగులోనూ డబ్ అయ్యి, థియేటర్లలో ప్రదర్శితం కానుంది. ప్రస్తుతం ఆన్ లైన్ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. అయితే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారా? లేకపోతే కొన్ని వారాల తర్వాత ఏకంగా ఓటీటీలోనే ఆ యా భాషల్లో స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి.