Teena Sravya: పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్
ABN, Publish Date - Jan 22 , 2026 | 06:32 AM
ఇప్పటికే కుక్కల అంశం ఇటు రాష్ట్రం, అటు దేశంలో నిత్యం ప్రధాన వార్తగా నిలుస్తున్న సమయంలో తాజాగా మరో విషయం ఇప్పుడు తెలుగు నాట చర్చనీయాంశం అయింది.
ఇప్పటికే కుక్కల అంశం ఇటు రాష్ట్రం, అటు దేశంలో నిత్యం ప్రధాన వార్తగా నిలుస్తున్న సమయంలో తాజాగా మరో విషయం ఇప్పుడు తెలుగు నాట చర్చనీయాంశం అయింది. ఇటీవల ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ ఫొటో షో (The Great Pre Wedding Show) అనే సినిమాతో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ టీనా శ్రావ్య (Teena Shravya) బుధవారం తెలంగాణలో ప్రఖ్యాతి చెందిన వనదేవతలు సమ్మక్క సారక్క దర్శనార్థం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి (Medaram) వచ్చింది.
అయితే.. అక్కడ టీనా శ్రావ్య చేసిన పని ఇప్పుడు తీవ్రవిమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె తన పెంపుడు కుక్కను తులాభారం (Tulabharam)లో ఉంచి బంగారం (బెల్లం)తో తూకం వేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నటిపై కొందరు భక్తులు మండి పడుతున్నారు. ఇది ముమ్మాటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై శ్రావ్య వెంటనే సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవల తన పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైందని, ఆరోగ్యం కుదట పడితే ఎత్తు బంగారం ఇస్తానని మొక్కుకున్నానని తెలిపారు. తాను భక్తితోనే ఆ మొక్కు తీర్చానని, గిరిజన సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటే తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు.