‘నాగార్జున టీ షర్టులు’ మీరెలా అమ్ముతారు? వ్యాపారిని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు

ABN , Publish Date - May 13 , 2026 | 06:10 AM

అక్కినేని నాగార్జున రు, చిత్రాలతో టీ-షర్టులను విక్రయించడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

nagarjuna

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)పేరు, చిత్రాలతో టీ-షర్టులను విక్రయించడంపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తీవ్రంగా స్పందించింది. తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలను వాడుకుంటూ వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్‌) భంగం కలిగిస్తున్నారంటూ నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ తుషార్‌ రావు ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా సదరు వ్యాపారిని ప్రశ్నిస్తూ.. నాగార్జున ఫోటోలను వాణిజ్యపరంగా వాడుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చారని కోర్టు నిలదీసింది. తొలుత.. వ్యాపారి తరపు న్యాయవాది శృతి అయ్యర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ది ఘోస్ట్‌’ సినిమాకు తాము అధికారిక మర్చండైజింగ్‌ భాగస్వాములమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కనుక తమకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఓ మార్కెటింగ్‌ ఏజెన్సీ ద్వారా ప్రొడక్షన్‌ హౌస్‌తో తమకు ఒప్పందం ఉందని, నాగార్జున స్వయంగా ఆ వస్తువులను ప్రమోట్‌ చేశారని స్పష్టం చేశారు. దీనిపై నాగార్జున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

చివరికి, ఈ వ్యవహారంలో తమకు నాగార్జునతో కానీ, సంబంధిత నిర్మాణ సంస్థతో కానీ ఎటువంటి ప్రత్యక్ష ఒప్పందం లేదని వ్యాపారి న్యాయస్థానం ముందు అంగీకరించారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. నాగార్జునతో కానీ, ప్రొడక్షన్‌ హౌస్‌తో కానీ ప్రత్యక్ష ఒప్పందం లేదని మీరే అంగీకరిస్తున్నప్పుడు, టీ - షర్టులు విక్రయించే చట్టబద్థత ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించింది.

అయితే.. శృతి అయ్యర్‌ మరోసారి కలుగజేసుకుని తమ కంపెనీని ‘వాల్స్‌ అండ్‌ ట్రెండ్స్‌’ అనే మార్కెటింగ్‌ ఏజెన్సీ నియమించుకుందని, దానికి ప్రొడక్షన్‌ హౌస్‌తో ఒప్పందం ఉందని తెలిపారు. తమకు ఒక అవకాశం కల్పిేస్త ఆ ఆధారాలు చూపుతామని అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 3 కు వాయిదా వేసింది.

Updated Date - May 13 , 2026 | 06:10 AM