నిర్మాతల మండలిలో సంతకం ఫోర్జరీ కలకలం.. కమిటీ రద్దుకు రవికిషోర్ డిమాండ్
ABN , Publish Date - May 14 , 2026 | 09:40 PM
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (Telugu Film Producers Council)లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (Telugu Film Producers Council)లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. మండలి సభ్యుడు, మాజీ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు రవికిషోర్ పీవీ తాజాగా సంచలన ఆరోపణలు చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. ఇటీవల కొందరు మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పత్రికా ప్రకటన విడుదల చేశారంటూ ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు.
మే 11న విడుదలైన ఓ అధికారిక ప్రకటనలో ఉన్న సంతకం అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్‌దే కాదని, ఆయనే స్వయంగా ఆ సంతకంతో తనకు సంబంధం లేదని చెప్పినట్లు రవికిషోర్ వెల్లడించారు. ఇది తీవ్రమైన చట్టవిరుద్ధ చర్య అని పేర్కొంటూ, దీనిపై వెంటనే పోలీసు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా కార్యదర్శులు స్వతంత్రంగా ప్రకటనలు విడుదల చేయడం తమ అధికార పరిధిని దాటిన చర్య అని విమర్శించారు. ఇది నిర్మాతల మండలి సమిష్టి బాధ్యతను దెబ్బతీసే అంశమని అన్నారు.
ఇంకా, ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీ పదవీకాలం రెండేళ్ల క్రితమే ముగిసిందని, ఎన్నికలు నిర్వహించాల్సిన గడువు ముగిసి ఇప్పటికే 14 నెలలు దాటిపోయినా, పలువురు సభ్యులు ఇంకా పదవుల్లో కొనసాగడం అనైతికమని రవికిషోర్ వ్యాఖ్యానించారు. తాను మాత్రం నిబంధనల ప్రకారం తన పదవీకాలం ముగియగానే రాజీనామా చేశానని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆయన మూడు కీలక డిమాండ్లు చేశారు.
ప్రస్తుతం ఉన్న కార్యనిర్వాహక కమిటీని తక్షణమే రద్దు చేయాలని, కొత్త ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులతో కూడిన అడ్-హాక్ కమిటీ నియమించాలని కోరారు. అలాగే దామోదర్ ప్రసాద్ సంతకం ఫోర్జరీ చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రవికిషోర్ లేఖతో నిర్మాతల మండలిలో నెలకొన్న వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై మండలి నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.