Tollywood: పైరసీకి.. ఇక చెల్లు! TFCC కీలక ముందడుగు
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:27 AM
డిజిటల్ సినిమా పైరసీని అరికట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో కీలక MoU కుదుర్చుకుంది.
డిజిటల్ యుగంలో సినిమా పరిశ్రమకు అతిపెద్ద సవాలుగా మారిన ఆన్‌లైన్ పైరసీని అరికట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక ముందడుగు వేసింది. ఈ దిశగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా సినిమా విడుదలైన వెంటనే జరుగుతున్న పైరసీపై రియల్‌టైమ్ నిఘా, పైరసీ కంటెంట్‌ను త్వరితగతిన తొలగింపు, అలాగే నేరస్తులపై సమన్వయంతో కూడిన చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.

పైరసీపై.. రియల్‌టైమ్ నిఘా
ఈ MoU కింద పైరసీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు, మెసేజింగ్ యాప్‌లు, IPTV స్ట్రీమ్స్, మొబైల్ అప్లికేషన్‌లలో జరుగుతున్న అక్రమ ప్రసారాలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. గుర్తించిన కంటెంట్‌ను తక్షణమే తొలగించేందుకు ప్రత్యేక వ్యవస్థ అమలు కానుంది. సినిమా విడుదలైన తొలి గంటల్లోనే జరిగే పైరసీ వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కలిగే భారీ ఆర్థిక నష్టాలను అరికట్టడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో సినీ పరిశ్రమ–లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య వేగవంతమైన సమాచార మార్పిడి కీలకంగా మారనుంది.

పైరసీపై కఠిన చర్యలకు ఈ MoU మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ సమావేశంలో.. తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, IPS, TGCSB డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్, IPS, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ డి. సురేష్ బాబు, గౌరవ కార్యదర్శి కె. అశోక్ కుమార్, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, వై. సురేందర్ రెడ్డి, శ్రీమతి సుప్రియ యార్లగడ్డ, యాంటీ వీడియో పైరసీ సెల్ ఛైర్మన్ రాజ్ కుమార్ ఆకెళ్ళ, ప్రాజెక్ట్ హెడ్ మణింద్ర బాబుతో పాటు యాంటీ వీడియో పైరసీ సెల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.