మణిశర్మకు అరుదైన గౌరవం.. గౌరవ డాక్టరేట్ ప్రదానం
ABN, Publish Date - Aug 02 , 2026 | 04:28 PM
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ (Mani Sharma)కు మరో అరుదైన గౌరవం దక్కింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ (Vignan University) నిర్వహించిన 14వ స్నాతకోత్సవంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి భారత అటార్నీ జనరల్ డాక్టర్ ఆర్. వెంకటరమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్నాతకోత్సవం విద్యార్థుల జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే వేడుక అని అన్నారు. జ్ఞానం అనేది కేవలం సమాచారాన్ని సేకరించడం కాదని, సత్యాన్ని అన్వేషించే నిరంతర ప్రక్రియ అని వివరించారు.
యువతలో శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన, విచారణా స్పూర్తి, నైతిక విలువలు పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు. వ్యక్తిగత విజయం, దేశ ప్రగతి రెండూ జ్ఞానం, సామాజిక బాధ్యత, విలువల సమన్వయంతోనే సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మణిశర్మ, నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని (Rajeev Nannapaneni), గ్రీన్కో వ్యవస్థాపకుడు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ కొల్లి (Mahesh Kolli) లకు విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది.
అదే కార్యక్రమంలో చదువులో ప్రతిభ కనబరిచిన 63 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. మొత్తం 2,599 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేసినట్లు వీసీ ఆచార్య కేవీ కృష్ణకిషోర్ తెలిపారు. కార్యక్రమంలో చాన్సెలర్ పావులూరి సుబ్బారావు, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.