జంతర్‌మంతర్ వద్ద.. తెలుగు హీరో హంగామా! హుషారెత్తించే ప్రసంగం
ABN, Publish Date - Jul 25 , 2026 | 04:38 PM
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా భారీ నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ (Jantar Mantar Protest) వద్ద కొన్ని రోజులుగా భారీ నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై వేలాది మంది విద్యార్థులు నిరసన బాట పట్టారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని, పదవి నుంచి తప్పుకోవాలని నినాదాలు చేశారు.
ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ వినియోగించినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. వినూత్నంగా పాటలు, నినాదాలు, సృజనాత్మక ప్రదర్శనలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను పలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఖండిస్తూ వారికి మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది బాలీవుడ్, మలయాళ స్టార్స్ సైతం తమ గళం వినిపించారు తమ మద్దతు కూడా ప్రకటించారు.
ఈ నిరసనల్లో తెలుగు సినీ పరిశ్రమ నుంచి నటుడు, దర్శకుడు (లాహిరి లాహిరా లాహిరిలో ఫేమ్), తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం (Aditya Om) పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జంతర్‌మంతర్‌కు వెళ్లి విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న ఆయన, వారి డిమాండ్లకు సంఘీభావం తెలిపారు. విద్యా వ్యవస్థలో విశ్వసనీయత, పారదర్శకత అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాదు తాను స్వయంగా బీహార్‌కు చెందిన వాడైనప్పటికీ జై తెలంగాణ, జై ఆంధ్ర అంటూ తెలుగులోనూ మాట్లాడి అక్కడికి వచ్చిన వారిని అశ్యర్య పరిచారు. ఆపై అక్కడి యువతను ఉత్తేజ పరిచేలా ప్రసంగించారు. విద్యార్థుల సమస్యపై బహిరంగంగా మద్దతు తెలిపిన తెలుగు నటుడిగా ఆయన పేరు చర్చకు రాగా.. ఇతర సినీ ప్రముఖులు కూడా స్పందించాలని కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విరివిగా వైరల్ అవుతున్నాయి.