Tollywood: తెలుగు సినిమాలకు తొమ్మిది అవార్డులు
ABN, Publish Date - Jul 18 , 2026 | 06:42 PM
జాతీయ చలన చిత్ర అవార్డులలో తెలుగు సినిమాలకు మొత్తం తొమ్మిది కేటగిరిల్లో అవార్డులు లభించాయి. నాలుగు చిత్రాలకు రెండేసి అవార్డులు రావడం విశేషం.
72వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన వెలువడింది. మరోసారి తెలుగు సినిమా జాతీయ స్థాయిలో తన సత్తాను చాటింది. ఈసారి తెలుగు సినిమాలకు వివిధ కేటగిరిల్లో మొత్తం తొమ్మిది అవార్డులు లభించాయి. నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకున్న 'కల్కి 2898 ఏడీ' చిత్రం బెస్ట్ పాపులర్ అండ్ హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ మూవీగా అవార్డు గెలుచుకుంది. అలానే ఉత్తమ బాలల చిత్రంగా '35: చిన్న కథ కాదు' అవార్డుకు ఎంపికైంది. అలానే 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రం ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం అవార్డును గెలుచుకుంది. ఇక వ్యక్తిగత హోదాలో 'పుష్ప 2' కు స్క్రీన్ ప్లే సమకూర్చిన సుకుమార్, 'పుష్ప 2' కాస్ట్యూమ్ డిజైనర్ దీపాలీ నూర్, శీతల్ వర్మ, 'కల్కి 2' ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి, 'లక్కీ భాస్కర్'కు మాటలు అందించిన వెంకీ అట్లూరి, 35: చిన్న కథ కాదు లో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ ఉత్తమ బాలనటుడిగా, 'కమిటీ కుర్రోళ్ళు'కు మేకప్ అందించిన పి. రవికుమార్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా అవార్డులకు ఎంపికయ్యారు. ఆ రకంగా ఈ యేడాది జాతీయ స్థాయిలో మొత్తం తొమ్మిది అవార్డులు లభించగా, అందులో 'పుష్ప 2', 'కల్కి 2898 ఎ.డి', 'కమిటీ కుర్రోళ్ళు', '35: చిన్న కథ కాదు'కు రెండేసి అవార్డులు లభించాయి.
నేషనల్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Click Here