ముందు.. మీలో ఏది అసలైన సంఘమో తేల్చుకురండి
ABN, Publish Date - Sep 10 , 2026 | 06:05 AM
సినీ డ్యాన్సర్ల సంఘంలో ఏర్పడిన విభేదాలపై రంగారెడ్డి జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ శ్యామసుందర్ రెడ్డి స్పందించారు.
తమ సమస్యల పరిష్కారం, తమ సంఘంలో కొన్ని పోస్టులకు తిరిగి ఎన్నికలు నిర్వహించడం వంటి అంశాలపై సినీపరిశ్రమకు చెందిన డ్యాన్సర్ల సంఘం (Cine Dancers Association) నేతలు, పలువురు సభ్యులు బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని తెలంగాణ కార్మిక కమిషనర్ (Labour Commissioner) కార్యాలయంలో రంగారెడ్డి జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ శ్యామసుందర్ రెడ్డి (Shyamsunder Reddy) తో వారు బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సమావేశమయ్యారు.
సినీ పరిశ్రమలోని డ్యాన్సర్ల సంఘంలో రెండు గ్రూప్లు ఏర్పడ్డంతో ఒక సంఘం ఎన్నికలను అంగీకరిస్తుండగా, మరో సంఘం వ్యతిరేకిస్తోందని తెలిసింది. ఈ క్రమంలో రెండు గ్రూపుల వారు జాయింట్ కమిషనర్ శ్యామసుందర్రెడ్డితో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ, మీలో ఏది అసలైన సంఘమో మీ ఫెడరేషన్‌లోనే తేల్చుకుని రావాలని సూచించారు.
డ్యాన్సర్ల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ (Johnny Master) సతీమణి సుమలత (Sumalatha).. ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కార్యదర్శి పోస్టులకు తిరిగి ఎన్నికలు ప్రకటించడంతో సంఘంలోని ఒక వర్గం వారు దాన్ని వ్యతిరేకించినట్లు తెలిసింది. ఈక్రమంలోనే బుధవారం వారు కార్మిక కమిషనర్ కార్యాలయానికి వచ్చి జాయింట్ కమిషనర్‌ను కలిసి విన్నవించడంతో ఏది అసలు సంఘమో ఫెడరేషన్‌లో తేల్చుకుని రావాలని ఆయన సూచించడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం.