త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
ABN, Publish Date - Apr 22 , 2026 | 05:17 AM
నిర్మాత, నటుడు, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు(56) (Chittibabu) ఇకలేరు. మంగళవారం రాత్రి కొండాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ నిర్మాత, నటుడు, అనలిస్ట్, సీనియర్ బీజేపీ నాయకుడు త్రిపురనేని చిట్టిబాబు (70) (Chittibabu) ఇకలేరు. మంగళ వారం రాత్రి కొండాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఉషా లత, ముగ్గురు సంతానం నరోత్తం త్రిపురనేని, భాస్వంత్ త్రిపురనేని, మోనిషా త్రిపురనేని ఉన్నారు. చిట్టిబాబు మృతి వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ నాయకులు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్ (Varaprasad). 1970 జనవరి 1న కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో త్రిపురనేని మహారథి, హేమలత దంపతులకు జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ద రచయిత, నటుడు, నిర్మాత అయిన త్రిపురనేని మహారథి (Tripuraneni Maharathi) కుమారుడే చిట్టిబాబు. తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని చిట్టిబాబు కొనసాగించారు. తెలుగు సాహిత్యం, సినిమా రంగంలో మహారథి చేసిన గుర్తింపును చిట్టిబాబు తన వంతుగా గౌరవిస్తూ వచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా అనేక చిత్రాల్లో ఆయన నటించారు.
చిట్టిబాబు నిర్మాతగా కూడా వ్యవహరించారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన చర్చల్లో, యూనియన్ వ్యవహారాలలో ఆయన క్రియాశీలకంగా ఉండేవారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే.. తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన చిట్టిబాబు తన దీర్ఘకాల సినీ ప్రయాణంలో తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలలోని అనేక ప్రముఖులతో కలిసి పనిచేశారు. వారిలో ఏ. సి. తిరులోక్ చందర్, భారతి రాజా, కె. ఎస్. ఆర్. దాస్, కన్నదాసన్, వాలి, ఎం. ఎస్. విశ్వనాథన్, టి. రాజేందర్, శ్రీశ్రీ, ఆచార్య ఆత్రేయ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి మహనీయులు ఉన్నారు.
దర్శకుడిగా మారక ముందు, 28 ఏళ్ల వయసుకే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మొత్తం 47 సినిమాలకు సహ దర్శకుడిగా పనిచేశారు. ఆపై ఆయన తొలి చిత్రం “సంతానం” భారీ విజయాన్ని సాధించి, అవార్డులను అందుకుంది. అనంతరం ఆయన మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేగాక నటుడిగా కూడా చిట్టిబాబు గారు తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 30 చిత్రాలలో నటించారు. ఒక నిర్మాణ సంస్థను విజయవంతంగా నడిపి, సినీ రంగ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు.
కృష్ణ వంశీ, శివ నాగేశ్వరరావు, శోభన్, రసూల్ ఎల్లోర్, విజయన్, సౌందర్య, పరుచూరి బ్రదర్స్, శివ ప్రసాద్ వంటి అనేక ప్రతిభావంతులను సినీ రంగానికి పరిచయం చేశారు. అనంతరం రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టిన ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థాపన నుంచే కొనసాగుతున్నారు. సీనియర్ నాయకుడిగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు.