తెలంగాణా థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరి!
ABN, Publish Date - Aug 19 , 2026 | 05:24 PM
తెలంగాణ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో కొత్త జీవో రిలీజ్ చేసింది. కొత్తగా నాన్ ప్రీమియం అనే కేటగిరిని ఏర్పాటు చేసి ప్రతి థియేటర్లో 25శాతం సీట్లు కేటాయించాలని పేర్కొంది.
తెలంగాణలో కొంత కాలంగా సినిమా టిక్కెట్ రేట్లపై నిరసలు వ్యక్తమౌతున్నాయి. చిన్న నిర్మాతలు టిక్కెట్ ధరలు భారీగా ఉన్నాయని వాపోతుంటే, పెద్ద చిత్రాల నిర్మాతలు సినిమా విడుదల సమయంలో కనీసం పది రోజుల పాటు టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులు బాటు కల్పించాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మధ్యే మార్గంగా థియేటర్లలో 25 శాతం నాన్ ప్రీమియం కేటగిరిని ఏర్పాటు చేసి, ఆ విభాగాలలో టిక్కెట్ రేట్లను తగ్గించింది. ఈ సవరణలను తెలియచేస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జీవోను తీసుకొచ్చింది.
ఈ జీవో ప్రకారం 7.1 సౌండ్, 2కె/4కె స్క్రీన్స్ ను స్పెషల్ కేటగిరీగా పేర్కొన్నారు. ఉదయం 8 నుండి రాత్రి ఒంటి గంటవరకూ సింగిల్ స్క్రీన్స్ తో సహా అందరూ ఐదు షోలు వేసుకోవడానికి అనుమతినిచ్చారు. అయితే ఇందులో ఖచ్చితంగా ఒక చిన్న సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది. అలానే వంద కోట్లు పై బడిన సినిమాలకు సూపర్ హై బడ్జెట్ హోదా లభిస్తుంది. ఈ సినిమాలు విడుదలైన తొలి పది రోజుల్లో టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చు. అయితే కార్మికుల సంక్షేమ నిధికి వీరు రూ. కోటి వరకూ విరాళం ఇవ్వాలి.
ఇక సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ లకు కూడా ప్రభుత్వం నిర్దిష్టమైన టిక్కెట్ ధరలను ఖరారు చేసింది. అయితే ప్రతి థియేటర్ లోనూ 25 శాతం సీట్లును నాన్ ప్రీమియం కేటగిరికి కేటాయించాల్సి ఉంటుంది. ఆ రకంగా నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం సీట్ట కనిష్ఠ ధరను రూ. 30 నుంచి 70కి, ప్రీమియం కేటగిరిలో కనిష్ఠ ధరను రూ. 50 నుంచి గరిష్ఠంగా 100 వరకూ పెట్టుకోవచ్చు. ఇక ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్టంగా రూ. 50 నుంచి గరిష్ఠంగా రూ. 150 ఉండొచ్చు. ఇదే థియేటర్లలో ప్రీమియం కేటగిరిలో కనిష్ఠం రూ. 100 నుంచి గరిష్ఠంగా రూ. 200 ఉండొచ్చు. అలానే స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్టం 100 నుంచి గరిష్ఠం రూ. 250 ఉండొచ్చు అని ప్రభుత్వం తన ఉత్తర్వులలో పేర్కొంది. అలానే ఇదే థియేటర్లలో ప్రీమియమ్ క్లాస్ టిక్కెట్లను కరిష్ఠంగా రూ. 200 నుంచి గరిష్ఠంగా రూ. 300కు నిర్ణయించింది. ఇక మల్టీప్లెక్స్ థియేటర్లలో మినిమమ్ రూ. 100 నుంచి గరిష్ఠంగా రూ. 250, ఇదే థియేటర్లలో రిక్లైనర్ సీట్లను మినిమమ్ రూ. 200 నుంచి మాగ్జిమమ్ రూ. 300 వరకూ ఉండేలా ప్రభుత్వం నిర్దారించింది.
మొత్తంగా చూసుకుంటే... టిక్కెట్ రేట్లలో పెద్దంత తేడా లేదు కానీ సామాన్యులు సినిమాలను చూసేలా... ప్రతి థియేటర్లలో ఇరవై ఐదు శాతం నాన్ ప్రీమియర్ కేటగిరిని ఏర్పాటు చేయడమే ఇందులోని ప్రధానాంశం. అలానే ప్రతి థియేటర్ వారూ ఖచ్చితంగా ఒక షో చిన్న సినిమాకు కేటాయించాలన్నది కూడా కీలకాంశమే. ఇక టిక్కెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ను ప్రభుత్వం 'సంక్షేమ నిధికి సహకారం' అందించే వారికి అధికారికంగా కల్పించినట్టు అయ్యింది. మరి దీనిపై సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్...
Balakrishna: 'రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి
ఓటీటీకి వచ్చేస్తోన్న కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చు అంటే