Bhatti Vikramarka: తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది
ABN, Publish Date - Feb 06 , 2026 | 06:07 PM
తెలుగు సినిమా పరిశ్రమ ఏ క్షణంలో ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) హామీ ఇచ్చారు
తెలుగు సినిమా పరిశ్రమ ఏ క్షణంలో ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం (Tg Govt) చేయడానికి సిద్ధంగా ఉందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) హామీ ఇచ్చారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 19న జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards) కమిటీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘భారతీయ చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేయాలన్నది తెలంగాణా ప్రభుత్వ బలంగా సంకల్పించింది. ఈ మేరకు ప్లాన్ కూడా సిద్ధం చేశాం. ప్రతిభ, వాతావరణ పరిస్థితులు.. ఇలా పలు అంశాల్లో హైదరాబాద్ ప్రత్యేకమైంది. సినీ రంగం ద్వారా సామాజికంగా సందేశాలు ఇవ్వొచ్చు, వాణిజ్యపరంగా లబ్ధి పొందొచ్చు. చిత్ర పరిశ్రమ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ప్రపంచాన్ని కూడా ఆకర్షించవచ్చు. తెలుగు సినిమా ప్రపంచస్దాయిలో అవార్డులను సొంతం చేసుకుంది. రేవంత్ , కోమటిరెడ్డి మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏ అవసరం వచ్చినా మా ప్రభుత్వం సాయం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేకంగా చెప్పమన్నారు. ఈ అవార్డుల వేడుకను దిల్‌రాజు బాధ్యతాయుతంగా తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో ఆయన మాట్లాడుతుంటారు. సినీ రంగ అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న సలహాలు, సూచనలు మాకు ఇస్తుంటారు. మణిశర్మ జ్యూరీ చైర్మన్ గా, కమిటీ మెంబర్స్ తో కలిసి పారదర్శకంగా సినిమాలను ఎంపిక చేస్తారని నమ్ముతున్నాము. భారతదేశమంతా మన వైపు చూసేలా భారీగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది' అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.