మెగాస్టార్ ముందుకు ఎగ్జిబిటర్స్ సమస్య!

ABN , Publish Date - May 25 , 2026 | 11:04 AM

తెలంగాణ ఎగ్జిబిటర్స్ చిరంజీవిని కలిసి, తమ సమస్యను తెలియచేయబోతున్నారు. 'పెద్ది' సినిమా నుంచే పెర్సంటేజ్‌ సిస్టమ్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Mega Star Chiranjeevi

అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు 'పర్సెంటేజ్‌' బాల్‌ మెగాస్టార్ చిరంజీవి కోర్టులో పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ వేసిన సబ్ కమిటీ సూచనల పట్ల విముఖంగా ఉన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ రెండు రోజుల క్రితం 'పెద్ది' సినిమా నుంచే తమకు పర్సెంటేజ్ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. మధ్యలో కొందరు సినిమా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేసినా... ఎగ్జిబిటర్స్ ససేమిరా అంటున్నట్టు తెలిసింది. దాంతో తమ ప్రస్తుత పరిస్థితిని డైరెక్ట్ గా చిరంజీవికే తెలియచేస్తామని మొన్నే తెలంగాణ ఎగ్జిబిటర్స్ సూచన ప్రాయంగా తెలిపారు. ఇవాళ సాయంత్రం వీరంతా చిరంజీవిని కలిసి, ఆయనకు తమ సమస్యను ఏకరవు పెడతారని తెలుస్తోంది.


మెగా ఫ్యామిలీకి చెందిన వారి సినిమాల విడుదల సమయంలోనే ఇలాంటి సమస్యలను కావాలని తెర మీదకు తీసుకొస్తున్నారని నట్టికుమార్‌ వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అందులో వాస్తవం లేదని, పర్సంటేజ్‌ విధానాన్ని అమలు చేయాలనే తమ డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉందని, దానికి మెగాస్టార్‌ ఫ్యామిలీ హీరోల సినిమాల విడుదలకు సంబంధం లేదని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. ఈ సమస్యను సంక్లిష్టం చేయడానికే కొందరు ఇలాంటి అపవాదులను తమపై వేస్తున్నారని వారు వాపోతున్నారు.


జూన్ 4న 'పెద్ది' సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో డైరెక్ట్ గా చిరంజీవి దగ్గరకే వెళ్ళి తమ గోడును వెళ్ళబోసుకుంటే... ఆయన సానుకూలంగా స్పందించే అవకాశం ఉండొచ్చని కొందరు ఎగ్జిబిటర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడలో ఆదివారం ఎపీఎఫ్డీసీ ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవంలోనూ నందమూరి బాలకృష్ణ ఎగ్జిబిటర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించడాన్ని అర్థం చేసుకోవాలని, తమ పట్ల నిజానికి స్టార్‌ హీరోలు సానుభూతితోనే ఉన్నారని, వారికి వాస్తవ పరిస్థితులు తెలియచేస్తే... తప్పకుండా పర్సంటేజ్‌ విధానానికి అంగీకరిస్తారని మరి కొందరు చెబుతున్నారు. మరి చిరంజీవి ఇవాళ సాయంత్రం ఎన్నిగంటలకు ఎగ్జిబిటర్స్ కలుస్తారు? ఎవరెవరు ఆయనని కలిసే వారిలో ఉంటారు? అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

జ‌స్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చ‌ర‌ణ్.. అసలు విషయమిదే!

అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

Updated Date - May 25 , 2026 | 11:05 AM