హారర్ మూవీతో తాప్సీ టాలీవుడ్ రీ-ఎంట్రీ.. దర్శకుడెవరంటే

ABN , Publish Date - Aug 29 , 2026 | 02:13 PM

‘ఝుమ్మందినాదం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్లాలని చూసింది. అయితే ఇక్కడ అనుకున్న స్థాయిలో స్టార్‌డమ్ దక్కకపోవడంతో, తను పూర్తిగా బాలీవుడ్ బాట పట్టింది.

Taapsee Pannu Tollywood Re Entry Update

టాలీవుడ్‌‌లో ఒకానొక సమయంలో తనదైన గ్లామర్, అల్లరితో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న నటి తాప్సీ పన్ను (Taapsee Pannu). ‘ఝుమ్మందినాదం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్లాలని చూసింది. అయితే ఇక్కడ అనుకున్న స్థాయిలో స్టార్‌డమ్ దక్కకపోవడంతో, తను పూర్తిగా బాలీవుడ్ బాట పట్టింది. హిందీలో వరుస లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ముంబైకి వెళ్లిన తర్వాత టాలీవుడ్ సినిమాల గురించి, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచుల గురించి ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో తెలుగు చిత్రసీమలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టడానికి ఆ వ్యాఖ్యలు కూడా ఒక కారణమయ్యాయి.


కొంతకాలంగా టాలీవుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న తాప్సీ, ఇప్పుడు మళ్లీ తెలుగు తెరపై కనిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, త్వరలోనే ఆమె టాలీవుడ్‌లో ఒక గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi), నటి తాప్సీతో ఒక హారర్‌ మూవీని తెరకెక్కించనున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న మేర్లపాక గాంధీ, ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా సరైన సక్సెస్‌ల కోసం ఎదురుచూస్తున్న మేర్లపాక గాంధీకి ‘కొరియన్‌ కనకరాజు’ రూపంలో గ్రాండ్‌ హిట్‌ దక్కడంతో ఇప్పుడు అదే జోనర్‌లో మరో హారర్‌ మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో మెయిన్ లీడ్ కోసం తాప్సీని సంప్రదించగా, కథ నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.


సాధారణంగానే మేర్లపాక గాంధీ సినిమాల్లో స్క్రీన్‌ప్లే చాలా వేగంగా, ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుంది. ‘కొరియన్‌ కనకరాజు’ వంటి మరో హారర్‌ జానర్‌ మూవీతో రావడం, అందులోనూ బాలీవుడ్‌లో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న తాప్సీ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం భయపెట్టడమే కాకుండా, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. ఇక హిందీలో ‘పింక్, నామ్ షబానా, లూలా సే లూప్’ వంటి వైవిధ్యమైన, ఇంటెన్స్ రోల్స్ చేసిన తాప్సీ.. ఈ హారర్ సినిమాలోనూ చాలా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టి, బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన తాప్సీ.. చాలా కాలం తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ హారర్ ఎంటర్‌టైనర్ ఆమె కెరీర్‌కు తెలుగులో రీ-లాంచ్ లాగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్.. పొలిటికల్ హీట్ పెంచిన పవర్‌ఫుల్ డైలాగ్స్

‘తలైవర్‌’తో సెల్ఫీ.. నమ్మలేని నిజం: కయాదు లోహర్‌

‘King100’ గ్లింప్స్.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా

Updated Date - Aug 29 , 2026 | 02:13 PM