సినిమా రంగంలో మహిళల హవా..
ABN, Publish Date - Nov 25 , 2026 | 08:46 PM
సినిమా రంగంలో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని నిర్మాత స్వప్న దత్ అన్నారు.
సినిమా రంగంలో మహిళలకు అవకాశాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయని ప్రముఖ సినీ నిర్మాత స్వప్న దత్ (Swapna Dutt) అన్నారు. ఒకప్పుడు కొన్ని విభాగాలకే పరిమితమైన మహిళలు.. నేడు కెమెరా, ఎడిటింగ్, దర్శకత్వం, టెక్నికల్ విభాగాలతో పాటు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ (FICCI FLO Vijayawada) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత, పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న ఆమె.. మహిళలు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మహిళలకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్న సందేశంతో విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో నగరంలోని గేట్‌వే హోటల్లో ఆర్థిక రంగంలో మహిళల పాత్ర.. పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదగాలనే అంశంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత స్వప్న దత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
తాను పుట్టిన ఊరు విజయవాడకు చాలా రోజుల తర్వాత రావడం ఎంతో సంతోషంగా ఉందని స్వప్న దత్ తెలిపారు. విజయవాడకు వచ్చిన ప్రతిసారీ కొత్త అనుభూతి కలుగుతుందని చెప్పారు. తమ నిర్మాణ సంస్థ నుంచి తెరకెక్కిన 'ఆకాశం లోకతార' సినిమా విడుదలైన తొలి వారంలోనే నగరంలోని మహిళలను కలవడం ప్రత్యేకంగా ఉందన్నారు. తమ బ్యానర్‌పై వస్తున్న సినిమాలు వరుస విజయాలు సాధించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులోనూ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపారు.
గతంలో సినీ పరిశ్రమలో మహిళలు ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కొన్ని విభాగాలకే పరిమితమయ్యేవారని.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని స్వప్న దత్ వివరించారు. ఎడిటింగ్, కెమెరా, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీషియన్ వంటి కీలక విభాగాల్లోనూ మహిళలు విజయవంతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తమ నిర్మాణ సంస్థలో 30 నుంచి 35 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని వెల్లడించారు. పలు స్టూడియోలలోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోందన్నారు.
సినిమా పరిశ్రమ కొత్త ప్రతిభను ఎప్పుడూ స్వాగతిస్తుందని.. మహిళలు తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి మరింత మంది సినీ రంగంలోకి రావాలని స్వప్న దత్ పిలుపునిచ్చారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడంతో పాటు పారిశ్రామికవేత్తలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. మహిళల ప్రతిభకు అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టించగలరని ఆమె అభిప్రాయపడ్డారు.