నాగబాబు, సురేఖ తర్వాత సుస్మిత.. మెగా ఫ్యామిలీకి వరుస పదవులు!
ABN, Publish Date - Sep 08 , 2026 | 05:11 PM
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, ప్రముఖ సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అరుదైన బాధ్యతను అప్పగించింది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుమార్తె, ప్రముఖ సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అరుదైన బాధ్యతను అప్పగించింది. విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గమ్మ (శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి) ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా సుస్మితను నియమిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయాభివృద్ధి కార్యక్రమాలపై సుస్మిత తన విలువైన సూచనలు, సలహాలు అందించనున్నారు. అంతేకాకుండా దసరా నవరాత్రులు వంటి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో ట్రస్ట్ బోర్డుతో కలిసి ఆమె భాగస్వామ్యం కానున్నారు.
ఇప్పటికే మెగా కుటుంబానికి చెందిన సభ్యులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోనూ, ఆధ్యాత్మిక రంగాన పలు కీలక బాధ్యతలు దక్కిన సంగతి తెలిసిందే. జనసేన నాయకుడిగా ఏపీ ప్రభుత్వంలో నాగబాబు కీలక పదవిని దక్కించుకోగా, మరోవైపు తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా సుస్మిత తల్లి సురేఖ కొణిదెల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు సుస్మిత కొణిదెలకు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా అధికారికంగా నియామకం జరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నిర్వహణలో మెగా కుటుంబం క్రియాశీలక భాగస్వామ్యం వహించినట్లయింది.
సినీ రంగానికి చెందిన కుటుంబం నుంచి వచ్చిన సుస్మితకు ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. చిరంజీవి కుమార్తెగానే కాకుండా పలు ప్రాజెక్టులకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో సుస్మితకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.